
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఓటర్లును తమ పార్టీపై విశ్వాసం ఉంచారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమించడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ఇది కార్యకర్తల గెలుపుగా ఆయన వర్ణించారు. తమ పార్టీని గెలిపించినందుకు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. గుజరాత్‌లో కులం కార్డుతో గెలవాలనుకున్న కాంగ్రెస్‌ను ఓటర్లు తిరస్కరించారని, హిమాచల్‌ప్రదేశ్‌లో అవినీతిని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. కుల, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పాయన్నారు.
కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు జరగలేదని, తాము పూర్తి ఆధిక్యం సాధించామన్నారు. తమకు ఓట్ల శాతం కూడా పెరిగిందని వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామని, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వస్తున్నామని, నరేంద్ర మోదీ నాయకత్వంలో 19 రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నామని తెలిపారు. కర్ణాటక సహా రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని అమిత్ షా అన్నారు.