లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. ఎక్కువ స్థానాలు గెలుచుకునే కూటమిగా ఎన్డీయే అగ్రస్థానంలో ఉండొచ్చు. కానీ ఈ కూటమి మెజారిటీకి 25–40 సీట్ల దూరంలోనే ఆగిపోవచ్చు.
యూపీయే పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్‌కువంద సీట్లు దాటవని, యూపీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ 150 మించవన్నది పలువురి అభిప్రాయం.
ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలకు 150 అంతకంటే ఎక్కువ సీట్లు దక్కవచ్చని అంచనా. బీజేపీ, కాంగ్రెస్‌ను కాదని ‘ప్రత్యామ్నాయ’ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలూ ఉన్నాయి.
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకో లేదా కూటమికో స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశమే కనిపించడం లేదు. ఐదు దశల ఎన్నికల (424 లోక్‌సభ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్) సరళిని పరిశీలించిన ప్రముఖ జర్నలిస్టులు, విశ్లేషకులు, ప్రజల నాడిని అంచనా వేసే నిపుణులు దాదాపుగా ఇదే చెబుతున్నారు. మొదటి దశ పోలింగ్‌కు ముందు వెలువడిన సర్వేల అంచనాలకు, ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత పరిణామాలకు తేడా బాగా కనిపిస్తోందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నా రు. ఎన్డీయే కూటమి మెజారిటీ సాధిస్తుందని అనేక సర్వే సంస్థలు పేర్కొనగా, మెజారిటీకి కొద్ది దూరంలో ఆ కూటమి ఆగిపోతుందని ఒకట్రెండు సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే, 5 దశల్లో 424 లోక్‌సభ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, నిపుణులు ప్రీ–పోల్ అంచనాలు వాస్తవాన్ని ప్రతిబింబించేలా లేవంటున్నారు. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. అదే విధంగా ఎక్కువ స్థానాలు గెలుచుకునే కూటమిగా ఎన్డీఏ అగ్రస్థానంలో ఉండొచ్చు. కానీ ఈ కూటమి మెజారిటీకి 25–40 సీట్ల దూరంలోనే ఆగిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎటొచ్చీ ఎన్డీయే 240 సీట్ల దగ్గరే ఆగిపోతుందన్నదే సట్టా బజారులో జరుగుతున్న ప్రచారం. మొదటి దశ నుంచి ఐదో దశ పోలింగ్ ముగిసేదాకా ఓటింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన సీనియర్ జర్నలిస్టులు, ప్రఖ్యాత విశ్లేషకులు, సర్వే పండితులు సైతం ఏ కూటమికీ మెజారిటీ రాకపోవచ్చంటున్నారు. ఎన్డీయే మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీయే పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్‌కు వంద సీట్లు దాటవని, యుపీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ 150 మించవన్నది వారి అభిప్రాయం. కేంద్రంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు సమానదూరంలో ఉన్న ఇతర పార్టీలకు 150 అంతకంటే ఎక్కువ సీట్లు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలను కాదని ఢిల్లీలో ప్రత్యామ్నాయ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తెరవెనుక మంత్రాంగం ముమ్మరమైంది. రెండు కూటముల్లో ఉన్న భాగస్వామ్య పార్టీలను బయటకు తీసుకొచ్చి వారి సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా సాగుతున్నాయి.
పసిగట్టిన బీజేపీ.. కాంగ్రెస్‌పై దూకుడు!
పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు, తర్వాతి పరిస్థితుల్లో మార్పును పసిగట్టిన బీజేపీ 4దశల పోలింగ్ తరువాత ప్రతిపక్షాలపై విమర్శల దాడి పెంచింది. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలో అవినీతి కుంభకోణాలను తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్ ప్రధానమంత్రుల వ్యక్తిగత వ్యవహారశైలిపైనా నేరుగా మోదీ విమర్శలకు దిగడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. బీజేపీ–కాంగ్రెస్ మాత్రమే పోటీ పడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందన్న వార్తలే దీనికి కారణమని విశ్లేషకులంటున్నారు. అలాగని.. యుపీయే అధికారంలోకి వచ్చేంత బలమైన పవనాలు కూడా దేశంలో ఎక్కడా లేవని చెబుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మెజారిటీ సాధించడంలో కీలకంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ.. ఈసారి సీట్లు గణనీయంగా తగ్గుతాయన్నది పోల్ పండితుల అంచనా. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 35 సీట్లు వరకు మాత్రమే రావచ్చన్నది తాజా అంచనా.
అదే జరిగితే ఆ ఒక్క రాష్ట్రం నుంచే బీజేపీకి 36 సీట్లు తగ్గుతాయి. అదే విధంగా ఎన్డీయే కూటమికి మెజారిటీ రావడానికి దోహదపడ్డ రాష్ట్రాల్లోనూ ఈసారి కొంత మేర సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొద్ది మేర సీట్లు గెలుచుకున్నా బీజేపీ బలం తగ్గినట్టే. మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఆ పార్టీకి మునుపటి కంటే 15 నుంచి 20 సీట్లు తగ్గుతాయని తాజా అంచనా. ఢిల్లీలో బీజేపీ తన సొంత బలాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య బెడిసికొట్టిన పొత్తు కమలదళానికి ఉపయోగపడే అవకాశముంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో తక్కువయ్యే సీట్లలో కొన్నింటినైనా.. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి సాధించాలనేది బీజేపీ నేతల ప్రయత్నం. దానిలో భాగంగానే మోదీ బెంగాల్‌పై ఎక్కువగా దృష్టి సారించారు. యూపీ తరువాత అత్యధిక సార్లు మోదీ, అమిత్‌షాలు ప్రచారం చేసిన రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. ఇక్కడ బీజేపీ 2014 ఎన్నికల్లో 2 సీట్లు సాధించగా ఈసారి 10–12 సీట్లు దక్కించుకోవచ్చన్నది పరిశీలకుల అంచనా. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న ఒడిశాలో ఆరేడు సీట్లు దక్కొచ్చని అంటున్నారు.
బీజేపీకి దక్షిణాదితో ఇక్కట్లే
తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతదేశ రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ దక్షిణాదిన బాగా బలహీనపడింది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెద్దగా లాభించే అవకాశాలే లేవు. జనతాదళ్ (ఎస్), కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ కర్నాటకలో గతంలో బలాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. కేరళలో అయితే బీజేపీ ఖాతా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీకి.. ఈసారి ఒకటి లేదా రెండు స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దక్షిణాదిన బీజేపీ దాదాపుగా పాతబలాన్నే నిలబెట్టుకోనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఆధిక్యతను కలుపుకున్నా ఎన్డీఏ కూటమి 240 సీట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది.
యుపీఏకు కొరవడిన నాయకత్వం
ఎన్డీయేకు తాము ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ ప్రజలను ఒప్పించలేకపోయింది. 2014 నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఈ పార్టీ కొంత బలపడ్డప్పటికీ ఆ పార్టీకి 100 సీట్లు దాటవని, కూటమికి వచ్చే మొత్తం సీట్లు 150 లోపేనని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న నిపుణులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ 16 సీట్లు గెలుచుకుంటుందని, తమిళనాడులో డీఎంకే ఫ్రంట్‌తో కలిసి 30కి పైగా స్థానాలు దక్కించుకుంటుందని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ఇక ఉత్తరాదిన గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో హస్తగతం చేసుకున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో.. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉంది.
మిగిలిన రెండు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోందని విశ్లేషకులు చెపుతున్నారు. మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ (ఎన్సీపీ)తో జత కట్టిన కాంగ్రెస్ కూటమికి 10–15 సీట్లు లభించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుందని, బిహార్‌లో పెద్దగా మార్పు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులంటున్నారు. దక్షిణాది, ఉత్తరాదిన కలిపి ఆ పార్టీ 100 లోపు స్థానాలకే పరిమితం అవుతుందని సట్టా బజారు అంచనా వేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్, టీడీపీ, నేషనల్ కాన్ఫరెన్ప్ (ఎన్సీ) ఇతర చిన్నా చితక పార్టీలను కలుపుకుంటే 150 స్థానాలకు మించి రావన్నది తాజా అంచనా.
కొత్త భాగస్వాముల కోసం వెతుకులాట
ఎన్డీయే 240 సీట్లకు పరిమితం అవుతుందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త భాగస్వాముల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు.. కొందరు ప్రాంతీయ పార్టీల నేతలతో తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలు కొన్నింటిని తమవైపునకు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే, మెజారిటీకి 120 కంటే ఎక్కువ సీట్ల దూరంలో ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్‌తో జత కట్టేందుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు ఆసక్తి చూపకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. పైపెచ్చు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా ఒప్పుకోబోనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇదివరకే ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రాహుల్ నాయకత్వానికి ఆమోదం తెలుపకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్‌కు కలిసివచ్చే మిత్రులు ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాహుల్, మోదీల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. ములాయంసింగ్ యాదవ్ కూడా మోదీనే సమర్థిస్తారన్న ప్రచారం ఉంది.
ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు
ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు కోసం కూడా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంకేతాలు కనపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తరువాత అతిపెద్ద పార్టీలుగా అవతరించనున్న తృణమూల్, వైఎస్సార్‌సీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్, డీఎంకే (ప్రస్తుతం యుపీయేలో ఉంది), జనతాదళ్ యునైటెడ్ (ప్రస్తుతం ఎన్డీయేలో ఉంది) వంటి పార్టీలతో పాటు వామపక్షాలను కలుపుకుని పోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో జరిపిన సమావేశం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కోసం చేసిన ప్రయత్నం ఇలాంటి ఆలోచనలకు తెరలేపింది. అటు ఎన్డీయే, ఇటు యుపీయేతో సంబంధం లేని పార్టీలు 150 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని సర్వే పండితులు అంచనా వేస్తున్నారు.
తృణమూల్, వైఎస్సార్‌సీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్, బీజేడీ పార్టీలు 120–135 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సట్టా బజార్ అంచనా వేస్తోంది. ఒకవేళ ఎన్డీయే మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోతే ఈ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు వచ్చి చేరే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ ఎన్‌డీయేకు 250 దాటితే ఈ పక్షాల్లోనే కొన్ని పార్టీలు షరతులతో కూడిన మద్దతిచ్చే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. అప్పుడు ఈ పార్టీలు కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశముంటుంది. రాష్ట్రాల ప్రయోజనాల పేరుతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను తెరమీదకు తెచ్చారు. రాష్ట్రాలకు నిధుల మంజూరు విషయంలో వివక్షను విడనాడాలని తరచూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్. ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి ముందుకు వచ్చిన వారికే ఆయన మద్దతిస్తానని స్పష్టంచేశారు. దీంతో ఎన్‌డీయే మెజారిటీకి 20–30 సీట్ల మధ్య ఆగిపోతే దేశంలో అందరి చూపు ఈ పక్షాల వైపే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
Comments
Please login to add a commentAdd a comment