పోటీ పసందు ఎవరో బిహార్‌ బంధు | Nitish kumar vs Tejaswi yadav fight in Bihar | Sakshi
Sakshi News home page

పోటీ పసందు ఎవరో బిహార్‌ బంధు

Published Fri, Apr 12 2019 5:53 AM | Last Updated on Fri, Apr 12 2019 5:55 AM

Nitish kumar vs Tejaswi yadav fight in Bihar - Sakshi

బిహార్‌లో ఎన్నికల రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎవరికి వారు సొంత ఎజెండాలు అమలు చేస్తూ అవతలి వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈసారి ఎన్డీయే, యూపీఏ.. రెండే కూటములు బరిలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ పరిపాలన, ప్రధాని మోదీ ఇమేజ్‌పై ఆధారపడితే, యూపీఏ కూటమి నితీశ్‌ కప్పదాటు వైఖరిని, కుల సమీకరణ లెక్కలనే అస్త్రాలుగా మార్చుకుంది.

‘ఇవాళ రేపు బిహార్‌లో మారుమూల పల్లెకు కూడా కరెంట్‌ ఉంది. ఇక లాంతర్‌ (లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆర్‌జేడీ పార్టీ గుర్తు) అవసరం ఎవరికుంది?’
– బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సూటి ప్రశ్న

‘అందితే జుట్టు. అందకపోతే కాళ్లు. నితీశ్‌ కుమార్‌ విధానమే అది. కొన్నేళ్లుగా ఆయన బట్టలు మార్చినంత సులువుగా కూటముల్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరితో జత కట్టారో అసలు ఆయనకైనా తెలుసా?’’
– జైలు నుంచి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కౌంటర్‌.

రంగులు మారిన రాజకీయం
2014 ఎన్నికల్లో బీజేపీ.. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ లోక్‌ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పాల్గొంది. 40 లోక్‌సభ స్థానాల్లో 31 గెలుచుకుంది. ఆర్‌జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేసి ఏడు స్థానాల్లో నెగ్గాయి. ఇక వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నితీశ్‌కుమార్‌ (జేడీయూ) రెండు స్థానాలకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఏడాదికే 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటముల రంగు మారాయి. ఆర్‌జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్‌ మహాగఠ్‌ బంధన్‌గా చేతులు కలిపాయి. బీజేపీ.. ఎల్‌జేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పీ, జేడీ (యూ)లో చీలిక వర్గమైన మాజీ ముఖ్యమంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తాన్‌ అవామ్‌ మోచీ (సెక్యులర్‌) కలిసి పోటీ చేశాయి.

యూపీఏ కూటమి మొత్తం 243 స్థానాలకు 178 సీట్లను గెలుచుకుంది. 41 శాతం ఓట్లు సాధించింది. ఎన్డీయే కూటమి 34 శాతం ఓట్లతో 58 సీట్లు సాధించింది. నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కానీ కూటమి కాపురం ఎన్నాళ్లో సాగలేదు. లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలతో జేడీ (యూ), ఆర్జేడీ మధ్య చిచ్చు ఏర్పడింది. ప్రభుత్వం కొనసాగలేకపోయింది. బీజేపీ మద్దతుతో మళ్లీ నితీశ్‌కుమార్‌ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీని విమర్శించిన నితీశ్‌ ఈసారి కలిసి వేదిక పంచుకుంటూ కేంద్రం పాలనను ఆకాశానికెత్తేస్తున్నారు.

అన్నిచోట్లా ముఖాముఖీ పోటీ
బిహార్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముఖాముఖి పోరాటమే నెలకొంది. ఎన్డీయే, మహాగఠ్‌ బంధన్‌ మధ్య పోరు నెలకొంది. ఎన్డీయే (బీజేపీ, జేడీ–యూ, ఎల్‌జేపీ)– మహాగఠ్‌ బంధన్‌ (కాంగ్రెస్, ఆర్‌జేడీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, హెచ్‌ఏఎం (ఎస్‌), జేఏపీ, ఎన్‌సీపీ) మధ్య  40 లోక్‌సభ స్థానాల్లో ముఖాముఖి పోరు నెలకొంది. వామపక్షాలు ఉనికి కోసం కొన్ని లోక్‌సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి. జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్న బెగూసరాయ్‌ మినహా మరెక్కడా కమ్యూనిస్టుల ప్రభావం లేదు. మహాగఠ్‌ బంధన్‌లో సీట్ల సర్దుబాటు కారణంగా ఆర్జేడీ ఈసారి 19 సీట్లలోనే పోటీ చేస్తోంది. ఇప్పటివరకు ఆర్‌జేడీ చరిత్రలో ఇంత తక్కువ సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్లు కేటాయించడం ఆ కూటమికి మైనస్‌ కావచ్చని అంచనా.

నితీశ్‌ వర్సెస్‌ తేజస్వి
ఈసారి లోక్‌సభ ఎన్నికలు నితీశ్‌ కుమార్‌ వర్సెస్‌ ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి మధ్య యుద్ధంలా మారాయి. నితీశ్‌కు ఓబీసీ వర్గాల్లో ఇప్పటికీ గట్టి పట్టుంది. ఇక లాలూ చిన్న కుమారుడు తేజస్వి చురుగ్గా పని చేస్తున్నారు. ఓబీసీ ఓటర్లలో యాదవులంతా ఇప్పటికే ఆర్‌జేడీకి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వారినీ తమ గూటికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. నిరుద్యోగం అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తూ యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కాగా, ఈసారి సర్వేలన్నీ మోదీ ఇమేజ్, నితీశ్‌ పాలనకు బిహారీ జనం జైకొడతారని అంచనా వేస్తున్నాయి. కుల సమీకరణలు, రంగులు మారే రాజకీయాల కంటే దేశ భద్రత, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మారుతాయని అంటున్నాయి. ఇక  కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీశ్‌ పాలనపై బిహార్‌లో 43 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సీఎస్‌డీఎస్‌–లోక్‌నీతి సర్వే చెబుతోంది.

లాలూ లేని ఎన్నికలు
దాణా కేసులో జైలు పాలైన ఆర్‌జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఆయన ఎన్నికల బరిలో ఉంటే, ప్రచారంలో పాల్గొంటే ఆ మజాయే వేరు. తన హాస్య చతురతతో ప్రత్యర్థి పార్టీలనూ నవ్విస్తారు. సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్‌లో లాలూ ఉంటారని ఒకప్పుడు సరదాగా చెప్పిన ఆయన తాను ఎన్నికల బరిలో లేని లోటు తెలియకుండా జైలు నుంచి కూడా ప్రకటనలు ఇస్తున్నారు. మోదీ సభలకు వచ్చే జనాన్ని చూసి ‘నేనలా సరదాగా నడుచుకుంటూ పాన్‌ షాప్‌కే వెళితే నా చుట్టూ అంతమంది  గుమిగూడతారు’ అంటూ సెటైర్లు వేశారు. ఓటర్లు లాలూని మిస్‌ అవుతున్నప్పటికీ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ పార్టీలో స్టార్‌ క్యాంపెయినర్‌గా మారుతున్నారు.

ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు
 దేశ భద్రత
బిహార్‌ ఎన్నికల్లో దేశ భద్రత అనేది కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరీ ఘటన తర్వాత పాక్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్, బాలాకోట్‌పై దాడులు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోదీ అణచివేయడం వంటి చర్యలపై ఓటర్లలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. పాక్‌ నక్కజిత్తుల్ని తిప్పికొడుతున్న మోదీకి మరో చాన్స్‌ ఇవ్వొచ్చని గయ పట్టణంలో అభిషేక్‌ కుమార్‌ అనే ఓటరు వ్యాఖ్యానించారు. అయితే సాసారాం నియోజకవర్గానికి చెందిన రవిదాస్‌ అనే ఓటరు మాత్రం ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు ఇలాంటివేవీ పనిచేయవని, కులాలే ఎన్నికల్ని శాసిస్తాయని అంటున్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ ఏసీ గదుల్లో కూర్చునే వారు దేశ భద్రతపై లెక్చర్లు దంచుతారేమో కానీ సామాన్యులకు అవేవీ పట్టవని అభిప్రాయపడ్డారు.
 
అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు

అగ్రవర్ణాల్లో నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశం కాబోతోంది. ఎందుకంటే బిహార్‌లో అగ్రవర్ణాలు 15 శాతం వరకు ఉన్నారు. వారంతా రిజర్వేషన్లపై హర్షం ప్రకటించారు. ఓబీసీ ఓటర్లపై ఆధారపడుతున్న యూపీఏ కూటమి దీనిని సమర్థంగా తిప్పికొట్టలేక పోతోంది. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేయడంలో విఫలమవుతోంది.
 
నిరుద్యోగం, ప్రత్యేక హోదా
ఈ రాష్ట్రంలో ఈ రెండు అంశాలే ప్రచారాస్త్రం కానున్నాయి. యూపీఏ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ప్రధానమంత్రి మోదీ గత ఎన్నికల్లో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అది నెరవేర్చలేదు. దీనిపై యూపీఏ  గట్టిగానే నిలదీస్తోంది.

ఏ కూటమి వ్యూహాలేమిటి?
యూపీఏ మేథమేటిక్స్‌
మహాగఠ్‌ బంధన్‌లో మొత్తం ఆరు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్‌జేడీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ, హెచ్‌ఏఎం (ఎస్‌), జేఏపీ, ఎన్‌సీపీ.. ఇవన్నీ కుల సమీకరణలు, వాటి అంకెలు, లెక్కలపై ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగాయి. రాష్ట్ర జనాభాలో 17 నుంచి 18 శాతం మంది ముస్లింలే ఉన్నారు. వీరంతా కాంగ్రెస్, ఆర్‌జేడీకి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక యాదవులు ఓట్లు 16 నుంచి 17 శాతం వరకు ఉంటాయి. సంప్రదాయంగా వాళ్ల మద్దతు ఆర్‌జేడీ వైపే. జనాభాలో 4 శాతం ఉన్న కొయిరి ఓటర్లు ఆర్‌ఎల్‌ఎస్‌పీ వైపే మొగ్గుతాయి. యూపీఏ కుల సమీకరణలకి ఇది ఊతమిచ్చేలా ఉంది. జీతన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎం పార్టీ కూడా యూపీఏలో భాగస్వామి కావడంతో దళిత ఓటర్లు యూపీఏ వైపు మొగ్గు చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ కుల సమీకరణలు కాకుండా అభివృద్ధి అంశంలో నితీశ్‌పై అస్త్రాలు సంధించడానికి ఏమీ లేక రోజుకొక కూటమి మార్చే ఊసరవెల్లిగానే నితీశ్‌ను యూపీఏ పక్షాలు ఏకి పారేస్తున్నాయి. ఇక బిహార్‌లో నిరుద్యోగం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలను కూడా యూపీఏ ప్రచారంలో లేవనెత్తుతూ ఎన్డీయేని ఇరుకున పెట్టే వ్యూహాలను రచిస్తున్నాయి.

ఎన్డీయే కెమిస్ట్రీ
రాష్ట్రంలో కులసమీకరణలతో పాటుగా ఎన్డీయే అభివృద్ధి మంత్రాన్ని కూడా జపిస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్‌ భవ, నిరుపేదలకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చే ఉజ్వల పథకం, టాయిలెట్ల నిర్మాణం వంటివి ప్రజల్లో ఆదరణ పొందాయి. ఇక బిహార్‌ అగ్రకులాల ఓట్లు 14 నుంచి 15 శాతం వరకు ఉన్నాయి. ఇవి సాధారణంగా బీజేపీకే పడతాయి. ఇక కుర్మీ ఓట్లు 4–5 శాతం ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆ ఓటర్లంతా ఆయన వెంట నడుస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జేడీ (యూ) ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ కాదు. కానీ ఈసారి ఎన్డీయేతో చేతులు కలపడంతో కూటమి బలోపేతమైంది. ఇక రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ శక్తిని తక్కువగా అంచనా వేయలేం. జనంలో కరిష్మా కలిగి, ఓటర్లను ప్రభావితం చేయడంలో జీతాన్‌ రామ్‌ మాంఝీ కంటే శక్తిమంతమైన నాయకుడు పాశ్వాన్‌. దీంతో దళిత ఓటర్లు చాలామంది ఎన్డీయే వైపు కూడా నడిచే అవకాశం ఉంది. ఇది ఎన్డీయే కూటమికి కలిసొచ్చే అంశం. నితీశ్‌కుమార్‌ తరచూ కూటములు మారుస్తారన్న పేరైతే ఉంది కానీ, వెనుకబడిన బిహార్‌లో అభివృద్ధి వెలుగులు విరజిమ్మిన నాయకుడు. అవినీతి, బంధుప్రీతి లేకుండా సుపరిపాలన అందించడంలో నితీశ్‌ది ప్రత్యేక స్థానం. మారుమూల గ్రామాల్లోనూ విద్యుత్‌ వెలుగులు పూయించారు. రోడ్లు, తాగునీటి æ సౌకర్యాలు కల్పించారు. నేరాలను అదుపు చేశారు.  అందుకే కులాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. మోదీ ఇమేజ్‌ కూడా కలిసి వచ్చి ఎన్డీయే జయకేతనం ఎగురవేయడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement