
చండీగఢ్: పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తాజాగా జరిగిన లుథియానా నగర పాలక ఎన్నికల్లో హస్తం పార్టీ సత్తా చాటింది. శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి రెండో స్థానంలో సరిపెట్టుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు మరోసారి భంగపాటు ఎదురైంది.
లుథియానాలో 95 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ తొమ్మిది కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ 61 వార్డుల్లో ఘన విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అకాలీదళ్ 11, బీజేపీ 10 స్థానాలు దక్కించుకున్నాయి. లోక్ ఇన్సాఫ్ పార్టీ 7 చోట్ల గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానానికే పరిమితమైంది. స్వతంత్రులు నాలుగు స్థానాల్లో పాగా వేశారు.
ఈ నెల 24న జరిగిన లుథియానా నగర పాలక ఎన్నికల్లో 59 శాతంపైగా పోలింగ్ నమోదైంది. పురుషులు 59.70 శాతం, మహిళలు 57.66 శాతం మంది ఓట్లు వేశారు. 4.17 శాతం థర్డ్ జెండర్ ఓటింగ్ నమోదైంది. మొత్తం 494 మంది అభ్యర్థులు పోటీ చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అమృత్‌సర్, జలంధర్, పాటియాల నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment