సొంతింటికి వచ్చినట్టుంది: సిద్ధూ
న్యూఢిల్లీ: తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదినని, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సొంతింటికి తిరిగి వచ్చినట్టు ఉందని టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్తో కలసి ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లు పనిచేశారని సిద్ధూ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఆదివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీకి, ఎంపీ పదవికి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. సిద్ధూ కంటే ముందు ఆయన భార్య, ఎమ్మెల్యే నవ్జ్యోత్ కౌర్ కాంగ్రెస్లో చేరారు. పంజాబ్ హక్కుల కోసం పోరాడుతానని సిద్ధూ చెప్పారు. పంజాబ్లో డ్రగ్స్ అక్రమ సరఫరా ఎక్కువగా ఉందని, దీనివల్ల యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడతామని హామీ ఇచ్చారు.