సాక్షి, విజయవాడ: ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక నూతన అధ్యయనాన్ని సృష్టించబోతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డబ్బు, మద్యం, పక్షపాతంగా ఎన్నికలు జరిపించారని విమర్శించారు. బాబు సృష్టించిన ఈ చెడ్డ సంస్కృతిని కూకటి వేళ్లతో సహా పెకిళించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బుతో రాజకీయం చేయాలనే రోజులకు కాలం చెల్లిందన్నారు. పాలన, పనితీరు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తాము పాలన సాగించామని తెలిపారు. మరో నాలుగేళ్లు ప్రజలకు జవాబుదారీతనంగా పాలన అందిస్తామన్నారు. అవినీతి కనుచూపు మేరలో కనబడకుండా సంక్షేమ పాలన సాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేయబోతున్నామో వివరించి ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. 22 డివిజన్లతోపాటు, మేయర్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుని వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు.(రాష్ట్రంలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా)
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లిన పథకాలే మా విజయానికి నాంది. నూటికి 80 శాతం మంది పేద ప్రజానీకానికి అవసరమైన పథకాలను ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీలు చివరి ఆరు నెలల్లో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చుతాయి. కానీ సీఎం జగన్ మొదటి ఆరునెలల్లోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారు. గత పాలకులు లక్షకోట్ల రాజధాని మాటలను ప్రజలు గమనించారు. సామాన్యులకు లక్ష కోట్ల రాజధాని అవసరం లేదు. ఆర్ధిక సంపన్నులకు ఉపయోగపడే రాజధాని అవసరం లేదు. పథకాలను ప్రజలు మెచ్చారు, అందుకే సీఎం జగన్‌కు అధికారం ఇస్తారు. స్థానిక సంస్థల్లో 99 శాతం సీట్లు కైవసం చేసుకుని వైసీపీ విజయఢంకా మోగిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. (తక్షణమే అమలులోకి ఎన్నికల కోడ్)
తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన రెండు స్కీంలు స్థానికంగా ప్రతి ఇంటికి చేరాయన్నారు. ప్రతి ఒక్క గ్రామపంచాయతీలోనూ వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ఆశించిన విజయాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సంక్షేమ పాలనపై ప్రజలే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జగనన్న మాకు మంచి పధకాలు ఇచ్చారని.. గెలిపిస్తే మరిన్ని పథకాలు తెస్తారని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్తుల నుంచి పంచాయతీ, మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. తిరువూరులోని నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment