మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. ఒకటి రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులన్నీ ఖర్చు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమన్న భట్టి.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజల సొమ్మును ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్ పంపిణీ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భట్టి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ తీరును వ్యతిరేకించారు. 'కేసీఆర్ తన మేనిఫెస్టో హామీలన్నీ నెరవేర్చానని చెప్పడం హాస్యాస్పదం. హామీల అమలుపై మేం సిద్ధం. పోలీసులు లేకుండా గ్రామసభలు పెట్టి ప్రజలను అడుగుదాం. కేసీఆర్ నువ్వు వస్తావా.. లేకుంటే నీ కొడుకు కేటీఆర్‌ను పంపినా చర్చకు మేము సిద్ధం. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలి. పాలకులు మంచి జరగాలని కోరుకుంటారు. కానీ కేసీఆర్‌లాగ భూకంపాలు రావాలని కోరుకోరు. కేసీఆర్ భూకంప ప్రకటనతోనే ఆయన మనస్తత్వం ఏమిటో అర్థమవుతోంది.
దేవెగౌడకు వంద కోట్లు!
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేద్దామని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. కర్ణాటకలో దేవెగౌడకు వంద కోట్లు ఇస్తానని చర్చలు జరిపారు. కేసీఆర్ బీజేపీకి ఏజెంట్‌గా మారాడు. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి బి-టీమ్ మాత్రమే. కేసీఆర్‌వి ఊసరవెల్లి రాజకీయాలు. హరీష్ రావు మాటలు దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉన్నాయి. ప్రాణహిత, ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను టీఆర్ఎస్ ఆపింది. రీడిజైన్ పేరుతో వేలకోట్లు అంచనాలు పెంచింది మీరు కాదా? పాత ప్రాజెక్టులకు పేరు మార్చి కొత్త ప్రాజెక్టులని చెప్పి అంచనాలను పెంచి టీఆర్ఎస్ సర్కార్ దోపిడీ చేస్తున్నదని' భట్టి విక్రమార్క ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment