వల్లాపురంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
ముదిగొండ: మధిరలో తన గెలుపును ఎవరూ ఆపలేరని, రాష్ట్రంలో దొరల పాలనను అంత మొందించేందుకే ఆత్మగౌరవ యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మధిర తాజా మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ మండలంలోని ముత్తారం, వనంవారికృష్టాపురం, వల్లాపురం, అమ్మపేట, కమలాపురం, అయ్యగారిపల్లి, గంధసిరి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఆత్మగౌరవ యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహానుభావుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటోతో ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్‌కు అమ్ముడు పోయారని ఆరోపించారు. పార్టీలు మారి పబ్బం గడుపుకుంటున్న ఖమ్మం ఎంపీ మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. మధిరలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని ప్రచారం చేస్తున్నారని, కలలో కూడా అది సాధ్యం కాదన్నారు.
మిషన్ భ గీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగాలు అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టారని, గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారని, ఇసుక మాఫీయాను అడ్డుకున్న పేదలను చితకబాదారన్నారు. తెలంగాణ వస్తే ప్రతి కుటుంబానికి ఓ ఉద్యోగం వస్తుందని చెప్పి న కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మరోసారి తనను ఆదరించి.. ఆశీర్వదించాలని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముత్తారంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పసుపులేటి లక్ష్మి, జెడ్పీటీసీ మందరపు నాగేశ్వరరావు, ఎంపీటీసీ టుకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌లు వడ్డేపూడి వెంకటేశ్వర్లు, బిచ్చా ల బిక్షం, మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దేవేంద్రం, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు, జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు, మండల నాయకులు వల్లూరి భద్రారెడ్డి, మట్టా బాబురామిరెడ్డి, ఎస్‌కె సలీంపాఫా, పల్లిపాటి కృష్ట, మల్లెల అజయ్, పందిరి అంజయ్య, మూల శ్రీను, మందరపు ఉపేందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment