సంగీతానికి భాషా భేదాలుండవని అంటారు. తమ ప్రచారానికీ భాషా భేదాలు లేవని నిరూపిస్తున్నారు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ. బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, తెలుగు భాషలతో పాటు చైనీస్, సంతాలీ వంటి భాషల్లోనూ తృణమూల్ పార్టీ తమ అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ భాష వారు ఎక్కువుంటే ఆ భాషలోనే అక్కడ గోడలపై ఎన్నికల నినాదాలు, అభ్యర్థనలు రాయిస్తోంది. ప్రచారం కూడా ఆయా భాషల్లోనే సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బీజేపీ కృషి చేస్తున్న నేపథ్యంలో వారికి అడ్డుకట్ట వేసేందుకు మమతా బెనర్జీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ బహుభాషా ప్రచారం ప్రారంభించారు.
ఖరగ్‌పూర్ ఓటర్లలో 50 శాతానికిపైగా తెలుగు వారున్నారు. ఇక్కడ బీజేపీకి పట్టుంది. తృణమూల్ తరఫున ఇక్కడ మానస్ బునియా పోటీ చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం తృణమూల్ ఇక్కడ తెలుగులోనే ప్రచారం చేస్తోంది. ఈ ప్రాంత వాసులైన ప్రశాంత్‌రావు, తారకేశ్వరరావు తెలుగు ప్రచారానికి సహకరిస్తున్నారు. తాంగ్రా, సెంట్రల్ కోల్‌కతాలోని తిరేతా బజార్ ప్రాంతాల్లో చైనీయులు వేల సంఖ్యలో ఉన్నారు. వారిలో సగం మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దక్షిణ కోల్‌కతా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో తృణమూల్ అభ్యర్థి మాలారాయ్ తరఫున చైనా భాషలో ప్రచారం జరుగుతోంది. చైనా లిపిలో చిన్న చుక్క, గీతల్లో తేడాలొచ్చినా అర్థాలు తారుమారవుతాయి. ఆ పొరపాటు జరగకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నా’నని తాంగ్రాలో ఉంటున్న హో కింగ్ తైమ్ అనే చైనీయుడు చెబుతున్నారు. వెస్ట్ మిడ్నపూర్‌లో గిరిజన ఓటర్లు ఎక్కువ. వీరిలో 52 శాతం సంతాలీలే. దాంతో ఇక్కడ సంతాలీ భాషలో ప్రచారం సాగుతోంది. ఇలా ఏ ప్రాంతంలో ఏ భాషీయులు ఉంటే అక్కడ ఆ భాషలో ప్రచారం చేస్తూ తృణమూల్ ఎన్నికల ప్రచారానికి కొత్త హంగులు దిద్దుతోంది.
Comments
Please login to add a commentAdd a comment