వైఎస్ జగన్‌ను కలిసిన ఐపీఎస్ రవిప్రకాశ్, ఐఏఎస్ అధికారులు మురళీధర్‌రెడ్డి, జవహర్‌రెడ్డి
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎంతో నమ్మకంతో వైఎస్సార్ సీపీకి అఖండ మెజార్టీ అందించిన ప్రజలకు అత్యుత్తమ, ప్రజారంజక పాలన అందించడంపై కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పుడే దృష్టి సారించారు. ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులు, సుపరిపాలనకు చేపట్టాల్సిన మార్పులపై ఆయన కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుని పరిశీలించిన వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలసి పరిస్థితిని వివరించి రాష్ట్ర ప్రగతికి చేయూత ఇవ్వాలని కోరారు. ఢిల్లీ నుంచి సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన జగన్‌ను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. ఈ సందర్భంగా పరిపాలనలో తేవాల్సిన సంస్కరణలపై సీనియర్ ఐఏఎస్‌లతో ప్రాథమికంగా సమీక్షించారు.
చేసి చూపాలనే తపన..
‘తాను కోరుకుంటున్నట్లుగా పారదర్శకత, సుపరిపాలన అందించాలంటే ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రస్తుతం జగన్ అదే చేస్తున్నారు. ఏయే శాఖల్లో ఏం జరిగింది? ఏయే మార్పులు అవసరం. వాటిని చేయడానికి ఏం కావాలి? అధ్యయనం చేయడం కోసం ప్రాథమిక కసరత్తును కాబోయే ముఖ్యమంత్రి అప్పుడే ప్రారంభించారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎవరూ ఇలాంటి కసరత్తు చేసిన దాఖలాలు లేవు. పారదర్శకపాలన అందిస్తానని చెప్పడం కాదు, చేసి చూపించాలనే తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు తనకోసం వచ్చిన వారిని కలుస్తూనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజల ఆశలను నెరవేర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదారు రోజులు ఆయా శాఖలతో సమీక్ష, సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని మార్పులకు శ్రీకారం చుట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది శుభ సంకేతం...’ అని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు తెలిపారు.
జగన్‌ను కలసిన పలువురు ఉన్నతాధికారులు
వైఎస్ జగన్‌ను సోమవారం కలసిన వారిలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, ఎంటీ కృష్ణబాబు, ఉదయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, లక్ష్మీకాంతం, సంధ్యారాణి, ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్, వరప్రసాద్, సంజయ్, కార్తికేయ మిశ్రా, మేరి ప్రశాంతి, రవిప్రకాశ్, అరుణ్ కుమార్, సత్యనారాయణ, ముత్యాల రాజు, రేఖారాణి, ఇంతియాజ్, మురళీ, ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జి.చంద్రుడు, కె.వెంకట రమణారెడ్డి, సూర్యకుమారి, గౌతమ్ సవాంగ్, స్టీఫెన్ రవీంద్ర, త్రిపాఠి, సిద్ధార్థ కౌశల్, ప్రొటోకాల్ అధికారి అశోక్ బాబు తదితరులు ఉన్నారు. ఈ అధికారులను అడిషనల్ సెక్రటరీ ధనుంజయరెడ్డి దగ్గరుండి జగన్‌కు పరిచయం చేశారు. అదేవిధంగా గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్మిక విభాగం నేత గౌతమ్ రెడ్డి తదితరులు కూడా వైఎస్ జగన్‌ను కలిశారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం గన్నవరం విమానాశ్రయంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.55కు ఇక్కడికి చేరుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, నందిగం సురేశ్, మార్గాని భరత్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. వైఎస్ జగన్‌కు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, గన్నవరం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ నేత ఉప్పాల రామ్‌ప్రసాద్, పలువురు అధికారులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. వీరందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి బయలుదేరివెళ్లారు.
నేడు తిరుమలకు పయనం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు వెళ్తారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేసి 29 ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. కడపలో పెద్ద దర్గాను దర్శిస్తారు. తర్వాత పులివెందులకు వెళ్లి సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత కడప చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని నివాసానికి వెళ్తారు.
నాడు శ్రీవారి ఆశీస్సులతో పాదయాత్రకు శ్రీకారం
వైఎస్ జగన్ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఏ కార్యక్రమమైనా చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2017, నవంబర్ 4న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన తర్వాతే జగన్ నవంబర్ 6న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకుని ఈ ఏడాది జనవరి 9న ఆయన నేరుగా ఇచ్ఛాపురం నుంచి తిరుపతికి వచ్చారు. తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లి జనవరి 10న స్వామివారిని దర్శించుకున్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేయాలని, ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని కోరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment