సాక్షి, అమరావతి: రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన.. పరిపాలనా పరమైన అంశాలపై నిండైన పరిజ్ఞానం.. మూర్తీభవించిన మంచితనం, నిరాడంబరత.. దేవుడు, ప్రజలపై సంపూర్ణ విశ్వాసం.. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదల... విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం.. ఇవన్నీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో తాము గమనించిన లక్షణాలని పలువురు ఐఏఎస్ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇబ్బందులతో పాటు సాగునీటి రంగంపై జగన్‌కు ఉన్న అవగాహన చూస్తే ఆశ్చర్యం వేసిందని, ఎంతో అనుభవం గల నాయకుడి లక్షణాలు ఆయనలో కనిపించాయని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన తరువాత ఐదు రోజులుగా జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వెంటనే రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిపై జగన్‌లోని పట్టుదల, ఆరాటం దీన్నిబట్టి తేటతెల్లమవుతున్నాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రగతికి తొలి అడుగు
కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉంటే ఒకరినొకరు దూషించుకోవడం, రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజా సంక్షేమం కోసం పరితపించిన నాయకులను తమ ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదని ఐఏఎస్‌లు పేర్కొంటున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రధానమంత్రిని కలిసి, రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు సంప్రదింపులు జరపడం ప్రశంసనీయమని, రాష్ట్ర ప్రగతి దిశగా తొలి అడుగు పడినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ప్రధానమంత్రికి జగన్‌మోహన్‌రెడ్డి 55 నిమిషాల పాటు వివరించారని, లోతైన అవగాహన ఉంటే తప్ప అది సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రస్తావించిన అంశాలపై ప్రధానమంత్రి స్పందించిన తీరు సైతం బాగుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రధానికి వినతిపత్రం సమర్పించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)ను కూడా భాగస్వామిని చేయడం జగన్‌మోహన్‌రెడ్డిలోని ప్రత్యేకతను చాటిం దని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఏపీకి పునర్‌వైభవం తథ్యం
ఢిల్లీ పర్యటన సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ భవన్‌లో రిటైర్డ్ ఐఏఎస్‌లతో పాటు కేంద్ర సర్వీసులో ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికార దర్పం చూపించకుండా జగన్ తమను ఆప్యాయంగా పలుకరించారని, ఆయన ఇంత నిరాడంబరంగా ఉంటా రా? అని పలువురు అధికారులు చర్చించుకోవడం గమనార్హం. ఢిల్లీలో కేంద్ర సర్వీసులో ఉన్న తమను ఏపీకి వచ్చేయాల్సిందిగా జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వా నించడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర సర్వీలో ఉన్నంత కాలం రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న పట్టుదల పెరిగిందని మరో సీనియర్ అధికారి పేర్కొన్నారు. జగన్ వ్యవహారశైలి మన రాష్ట్రానికి మేలు చేస్తుందని, రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందడానికి వీలుంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం ఏపీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి సందేహాలకు తావులేకుండా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించారని ఐఏఎస్‌లు కొనియాడుతున్నారు. ఆయన వ్యవహార సరళి చూస్తే రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని, ఫలితంగా రాష్ట్రానికి పునర్‌వైభవం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అవి విప్లవాత్మక చర్యలు
జగన్ నిష్కల్మషంగా, ఆత్మీయంగా తమతో మాట్లాడారని పలు జిల్లాల కలెక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఏయే జిల్లాల్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారంటూ సర్వీసు వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అంతేకాకుండా పాదయాత్రతో పాటు వివిధ సందర్భాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలంటూ జగన్ సూచించారని గుర్తుచేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న పట్టుదల ఆయనలో ఉందని చెబుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి కూడా సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి పరిజ్ఞానం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సాగునీటి రంగంలో అవినీతి చోటుచేసుకున్న టెండర్ల రద్దు, టెండర్ విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని జగన్ చెప్పారని, నిజంగా ఇవన్నీ విప్లవాత్మకమైన చర్యలను అధికారులు ప్రశంసిస్తున్నారు.
అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసి, రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న తపన ఆయనలో కనిపించిందని, అంతేకాకుండా రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉన్నారని పేర్కొంటున్నారు. ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాలను ప్రజల వద్దకు చేర్చాలన్న తపన జగన్‌లో ఉందని, భిన్నమైన ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు చూస్తారని మరో సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు సంబంధించిన అంశాలపై పట్టు సాధించారని, ఏ అధికారి సేవలను ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై ఆయనలో స్పష్టత ఉందని తెలిపారు. పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం, పారదర్శకతకు పెద్దపీట వేయడం, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండడం, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం తన ధ్యేయమన్న సంకేతాలను జగన్ ఇప్పటికే ఇచ్చారని ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment