సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారి సామాజిక మంత్రి మండలిని ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పాలనా వ్యవస్థలు నాశనమయ్యాయని, చెడిపోయిన రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చడం కోసమే సీఎంగా ప్రమాణం చేశానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నీతివంతమైన పరిపాలన అందిస్తామని, అలా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ కోసం జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జడ్జి అనుమతితో టెండర్లకు వెళ్లే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి, దుబారాకు అడ్డుకట్ట వేయగలమని సీఎం అభిప్రాయపడ్డారు.
ఏడాది ముందే రైతు భరోసా
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీర్మానంపై విపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం.. ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. తన సుధీర్ఘ ప్రసంగంలో సీఎం అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రానున్న ఐదేళ్లూ తమ ప్రణాళికలు ఉంటాయని వెల్లడించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల శ్వాస, హోదా ఇచ్చే వరకు కేంద్రంపై ఒత్తిడి తేస్తూనే ఉంటాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావిసాం. సీఎం, మంత్రుల ఛాంబర్లో చూస్తే మా మేనిఫేస్టో కనబడుతుంది. ర్తెతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తాం. ఇచ్చిన మాట కంటే ఏడాది ముందే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాం. రైతన్నల సంక్షేమం కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.
ప్రభుత్వ పథకాలతో దేశమంతా ఏపీ వైపు చూసేలా..
రెండువేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని ఏర్పాటు చేస్తాం. బాబు పాలనలో ఇన్‌పుట్ సబ్సిడీ రూ.రెండువేల కోట్లు పెండింగ్‌లో ఉంది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు భీమా వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మారుస్తాం. విద్యాహక్కు చట్టాన్ని పునరుద్ధరిస్తాం. జనవరి 26న అమ్మబడి పథకం కింద ప్రతి తల్లికి రూ. 15వేలు ఇస్తాం. వచ్చే ఐదేళ్లలో నిరక్షరాస్యత శాతాన్ని సున్నాకి తీసుకువస్తాం. ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. దాని కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్ద్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీలకు జీతాలు పెంచాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లించాం. ప్రభుత్వ పథకాలతో దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తాం. ఆగస్ట్ 15న ఐదు లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వారితోనే ప్రతి పథకాన్ని డోర్‌డెలివరీ చేస్తాం. అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం గ్రామ సచివాలయంలో పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేస్తాం. జూలై 1 నుంచి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment