మందడం వద్ద ‘థ్యాంక్యూ సీఎం సార్’ ప్లకార్డులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న అమరావతి ప్రాంత రైతు కూలీలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పరిపాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పలువురు సామాజిక వేత్తలు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి బైక్ ర్యాలీలు నిర్వహించారు. కొత్తవలసలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు.
విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన ర్యాలీలో పాల్గొని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్న ప్రజలు
సీఎం నిర్ణయం సువర్ణాధ్యాయం
టెక్కలి (శ్రీకాకుళం జిల్లా): రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఉత్తరాంధ్రకు సువర్ణాధ్యాయం మొదలైందని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. టెక్కలిలో మంగళవారం ర్యాలీ, మానవహారం నిర్వహించి సంబరాలు చేసుకున్నారు.
ప్రకాశంలో సంఘీభావ ర్యాలీలు
చీరాల/ఒంగోలు/పర్చూరు: పాలన వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ప్రకాశం జిల్లాలో మంగళవారం పలుచోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు. పర్చూరులో నిర్వహించిన సంఘీభావ యాత్రలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామనాథం బాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు. వేటపాలెం నుంచి చీరాల వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముక్కోణం పార్కు కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి సీఎం పనిచేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు తన సామాజిక వర్గానికి ఆర్థిక లబ్ధి చేజారుతుందని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాపునేత వంగవీటి మోహనరాంగాను విజయవాడలో అతికిరాతకంగా హత్య చేయించిన చంద్రబాబు ఇప్పటికీ కుల రాజకీయాలు వదలడం లేదని ధ్వజమెత్తారు. ఒంగోలులో భారీ బైక్ ర్యాలీ జరిగింది.
మూడు రాజధానులు, పాలన వికేంద్రీకరణను స్వాగతిస్తూ ఒంగోలులో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు
విశాఖలో సంబరాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంపై విశాఖలో రెండో రోజు మంగళవారం కూడా సంబరాలు మిన్నంటాయి. బైక్ ర్యాలీలతో యువత సందడి చేశారు. ‘థాంక్యూ సీఎం’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. జీవీఎంసీ వద్ద మహానేత వైఎస్సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. వైస్ చాన్సలర్ ప్రసాద్‌రెడ్డి బెలూన్లు ఎగురవేశారు. గాజువాక, భీమిలి, పాడేరు, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో పలుచోట్ల బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు, క్షీరాభిషేకాలు జరిగాయి.
విశాఖలో వైఎస్సార్, సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
‘తూర్పు’లో స్వీట్ల పంపిణీ
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌లో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీ భరత్‌రామ్, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోషేన్‌రాజు, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు. కాకినాడ జేఎన్‌టీయూ వద్ద బెలూన్లు ఎగురవేశారు. విద్యార్థులకు, ప్రజలకు స్వీట్లు పంచారు.
కర్నూలులో హర్షాతిరేకాలు
సాక్షి నెట్‌వర్క్: కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుపై హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంబరాలు నిర్వహించారు. బనగానపల్లె, ఆదోని, కర్నూలులో న్యాయవాదులు ‘థాంక్యూ సీఎం సార్’ కార్యక్రమాన్ని చేపట్టారు. నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థులు ర్యాలీలు చేశారు. వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కర్నూలులో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
వికేంద్రీకరణకు జై
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ చిత్తూరు జిల్లాలో మంగళవారం విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. తిరుపతిలో వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పీలేరులో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వాల్మీకిపురంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నిండ్రలో సంబరాలు చేసుకున్నారు.పెద్దపంజాణి,బైరెడ్డిపల్లెలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment