CM YS Jagan: వికేంద్రీకరణే మా విధానం | CM YS Jagan On TDP And Chandrababu In AP Assembly Sessions | Sakshi
Sakshi News home page

CM YS Jagan: వికేంద్రీకరణే మా విధానం

Published Fri, Sep 16 2022 3:12 AM | Last Updated on Fri, Sep 16 2022 8:21 AM

CM YS Jagan On TDP And Chandrababu In AP Assembly Sessions - Sakshi

శాసన సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గత 75 ఏళ్లలో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తే వికేంద్రీకరణకు అర్థం చెబుతూ 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. 51 రెవెన్యూ డివిజన్లను 75కు పెంచాం. 91 పోలీస్‌ డివిజన్లు ఉంటే వాటిని 103కు పెంచి వికేంద్రీకరణకు అర్థం చెప్పాం. చివరకు కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ పెట్టమని చంద్రబాబు నాకు లేఖ రాశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఏ గాడిదలు కాశారో తెలియదు. కుప్పంలో ప్రజలు ఒత్తిడి చేస్తే నన్ను అడగక తప్పని పరిస్థితి వచ్చింది. 14 ఏళ్లు సీఎం.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన తీరు ఇది.  నిజమైన వికేంద్రీకరణ అంటే ఎలా ఉంటుందో మనం చూపించాం.

గ్రామ సచివాలయంలో ఏ సర్టిఫికెట్‌ జారీకైనా కచ్చితంగా గడువు పెట్టి ఇచ్చే మెకానిజమ్‌ పెట్టాం. ఇది ఆ పెద్దమనిషికి కనీసం ఏ రోజైనా తట్టిందా? రైతు భరోసా కేంద్రాలనే కాన్సెప్ట్‌ గురించి ఏ రోజైనా ఆలోచించారా? ఇవాళ రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ఇదీ వికేంద్రీకరణ అంటే.

ఇవాళ 2.70 లక్షల మంది గ్రామ వలంటీర్లు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలందిస్తున్నారు.   ప్రతి నెలా 1వ తేదీన సూర్యోదయానికి కంటే ముందే ఇంటి తలుపు తట్టి.. సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. రేషన్‌ సరుకులను ఇంటి వద్దే డోర్‌ డెలివరీ చేస్తున్నాం. ఇదీ వికేంద్రీకరణ అంటే.

దశాబ్దాలుగా నిర్మించుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే కూడా, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కంటే కూడా ఈ కట్టని, కట్టలేని అమరావతి వీరి దృష్టిలో ఎంతో గొప్పది. వీరు చేస్తున్న ఉద్యమం బీసీల అభివృద్ధి కోసమా! కాదే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసమూ కాదు. పేద ఓసీల అభివృద్ధి కోసం అంతకంటే కాదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమా.. అంటే అది కూడా కాదు. కేవలం ఈ పెత్తందార్ల సొంత అభివృద్ధి కోసం మాత్రమే ఈ ఉద్యమం చేస్తున్నారు.    
– అసెంబ్లీలో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ‘నేను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉంటున్న మూడేళ్ల నుంచీ ప్రతిసారి వికేంద్రీకరణ గురించే మాట్లాడాను. ఇంకా చెప్పాలంటే శ్రీబాగ్‌ ఒప్పందం మొదలు శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, బోస్టన్‌ గ్రూప్, ఎక్స్‌పర్ట్స్‌ గ్రూప్‌ వరకు కూడా అందరి అభిప్రాయం ఇదే. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.

అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలి. అదే మా విధానం.. నినాదం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. వికేంద్రీకరణ అంశంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన టీడీపీ వైఖరిపై, సంక్షేమాభివృద్ధికి వారు కలిగిస్తున్న విఘాతంపై మండిపడ్డారు.

‘తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు. దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు’ (ఇసుక నుంచి నూనె తీయొచ్చు. ఎండమావిలో నీరు తాగొచ్చు. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు కానీ.. మూర్ఖులైన చంద్రబాబుతో కూడిన ఈ దుష్ట చతుష్టయాన్ని ఒప్పించడం ఎవరి వల్లా కాదు) అన్న భర్తృహరి సుభాషితాన్ని ఉదహరిస్తూ దుష్టచతుష్టయం తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అక్కడికెళ్లి దేవుడిని ఏమని మొక్కుతారు?
వికేంద్రీకరణ వల్ల ఇంత మంచి జరుగుతుంటే దీన్ని కూడా వక్రీకరించి, అబద్ధాలు జోడించి, ప్రాంతాల మధ్య భావోద్వేగాలు పెంచుతున్నారు. అసలు ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఉత్తరాంధ్రకు వెళ్లి, అక్కడి దేవుడిని ఏమని మొక్కుతారు ? అభివృద్ధి అంతా ఇక్కడే ఉండాలని అక్కడి, ఆ ప్రాంత దేవుడిని మొక్కుతారట! ఉత్తరాంధ్ర ప్రజలు ఇది చూసి గమ్మున ఉండాలట! వారికి భావోద్వేగాలు ఉండవా?

► వారిని రెచ్చగొట్టడానికి ఏకంగా ఈ మనిషి (చంద్రబాబు) వీరందరినీ అక్కడికి పంపించడం ధర్మమేనా? అంటే వారు వారు కొట్టుకోవాలి. ఆయనకు గతంలో 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కుప్పం కూడా పోతుంది. ఒక్క సీటూ రాదు. ఆ విషయం ఈ పెద్ద మనిషికి బాగా తెలుసు. అందుకే పెట్రోల్‌ పోసి భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. 

► యాత్రలు మొదలు పెట్టించి, రాజకీయాల కోసం దిక్కుమాలిన పని చేస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లాభం పొందాలని చూస్తున్నారు. అంత నీచమైన స్థాయికి ఏ నాయకుడూ పోడు. కేవలం చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..ఇలా అందరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీరంతా పోతే తప్ప రాష్ట్రం బాగుండదు.  

వికేంద్రీకరణ అంటే ఇదీ.. 
► రాజధానులు మాత్రమే కాకుండా పరిపాలన అనేది మారుమూల గ్రామాలకు సైతం ఎఫెక్టివ్‌గా అందాలంటే వికేంద్రీకరణ అవసరం. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు ఉన్నాయా? ఎలా ఉంటాయి? వాటి వల్ల ఎలా మేలు జరుగుతుందనుకున్నారు. ఈరోజు అన్నీ కనిపిస్తున్నాయి. 

► చంద్రబాబు తాను 14 ఏళ్లు సీఎం, 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటారు. కానీ గవర్నెన్స్‌ను ఈ మాదిరిగా ఇంప్రూవ్‌ చేయగలుగుతామని ఏనాడైనా ఊహించారా? వ్యవస్థలో అవినీతి లేకుండా చేయగలుగుతాం. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఏర్పాటు చేసి మన పిల్లలు 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ ఉండి ప్రతి కుటుంబానికి సేవలందించమని ఏ రోజైనా ఆయన ఆలోచించారా?

► ఇవాళ ఏకంగా 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో దాదాపు 600 రకాల సేవలందిస్తున్నాం. వాటిలో దాదాపు 1.20 లక్షల మంది మన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారిలో 83 శాతం మంది నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నా చెల్లెమ్మలు.. నా తమ్ముళ్లు ఉన్నారని సంతోషంగా చెబుతున్నాను. వికేంద్రీకరణ అంటే ఇది.

► వ్యవసాయ శాఖ కార్యాలయం రాజధానిలో ఉంటుంది. అందువల్ల అక్కడ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడ స్థలాల రేట్లు పడిపోతాయని ఎవరైనా ఉద్యమం చేస్తే ఎలా ఉంటుంది? ఇవాళ వారు చేస్తోంది అదే. అన్నీ ఇక్కడే ఉండాలి. అన్నీ ఇక్కడికే రావాలి. రాజధానిలో భూముల రేట్లు పెరగాలి. అదే వారి ఉద్దేశం. వికేంద్రీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, విలేజ్‌ క్లినిక్‌లు ఇవన్నీ కూడా అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. వికేంద్రీకరణ అంటే ఇది. 

► ఇటీవలే నేను పులివెందులలోని వేల్పుల వద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించాను. అక్కడ డిజిటల్‌ లైబ్రరీ ఉంది. హైబ్యాండ్‌ విడ్త్‌తో అక్కడ ఇంటర్నెట్‌ ఉంది. 30 మంది పిల్లలు అక్కడే వర్క్‌ ఫ్రమ్‌ హోం కింద హాయిగా పని చేసుకుంటున్నారు. వికేంద్రీకరణ అంటే ఇది. ఆ పెద్దమనిషికి కనీసం ఏనాడైనా తట్టిందా? 

వికేంద్రీకరణ అంటే ఎలాగుంటుందో మొన్న వరదల్లో చూశాం
► పరిపాలన వికేంద్రీకరణ ఏ విధంగా ఫలితాన్నిస్తోందన్నది మొన్నటి గోదావరి వరదల్లో చూశాం. 40 ఏళ్లలో ఏనాడూ ఆ స్థాయిలో వరదలు రాలేదు. వికేంద్రీకరణ వల్లనే వరదల్లో బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందాయి. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ముట్టాయి.

► కోవిడ్‌ సమయంలో మన వలంటీర్ల సేవలు అద్భుతం. మొన్న గోదావరి వరదల్లో కూడా వలంటీర్లు కట్టల వద్ద నిఘా వేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. గతంలో గోదావరికి వరదలు వస్తే అటు వైపు ఇటు వైపు కలిపి కేవలం ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారు. కానీ వరదలు వచ్చినప్పుడు ఏకంగా ఆరుగురు కలెక్టర్లు. ఆరుగురు ఎస్పీలు.. ఇంకా సచివాలయాల సిబ్బంది కలిపి మొత్తం 30 వేల మంది సైనికుల్లా పని చేశారు. 

► మన రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా మరో 16 మెడికల్‌ కాలేజీలు రానున్నాయి. పార్వతీపురంలో మరో మెడికల్‌ కాలేజీ కూడా రానుంది. మన రాష్ట్రంలో టయర్‌ 1 సిటీలు లేవు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు లేవు. అందుకే 26 జిల్లాలను చేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగా ఏకంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు సూపర్‌ స్పెషాలిటీ వైద్య నిపుణులు వస్తారు. 

అందరూ బాగుండాలన్నదే మా విధానం 
► నేను మాత్రమే బాగుండాలంటే అది స్వార్థం. అందరం బాగుండాలంటే అది ఒక సమాజం. మనం తీసుకొస్తున్న సంస్కరణలు, చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో కనీసం 90 శాతం ప్రజలకు మేలు చేస్తున్నాయి. గ్రామ సచివాలయం మొదలు, రాష్ట్ర స్థాయి వరకు మన ఎజెండా ఒక్కటే. ఇంటింటికీ, ప్రతి మనిషికి మేలు చేయడమే. నేను మరోసారి ఈ విషయం స్పష్టం చేస్తున్నాను. నేను ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అందుకే మూడు రాజధానుల్లో ఒకటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. 

► నాటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాలలో మన పార్టీ 29 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. మంచి చేస్తున్నాం కాబట్టే 2019 ఎన్నికల తర్వాత జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లో మన పార్టీ స్వీప్‌ చేసింది. ఇది కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే కాదు. రాష్ట్రమంతా అవే ఫలితాలు వచ్చాయి. 

► ఎంపీటీసీ ఎన్నికల్లో 86 శాతం అంటే 8,298 చోట్ల వైఎస్సార్‌సీపీ గెల్చింది. ఎంపీపీలు 637 వైఎస్సార్‌సీపీకి వచ్చాయి. అంటే 98 శాతం సీట్లు గెలిచింది. జడ్పీటీసీలు 639 వైఎస్సార్‌సీపీకి వచ్చాయి. అంటే 98 శాతం గెలిచాం. జడ్పీ ఛైర్మన్లు వంద శాతం అంటే మొత్తం 13 గెల్చుకుంది. 14 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లలో వంద శాతం అంటే మొత్తం 14 గెలిచాం. 86 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 84 చోట్ల నెగ్గాం.

► ఇకపై కూడా ప్రజలు ఇలానే దీవించాలని, దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా. ఈ చర్చ వల్లనైనా చంద్రబాబుకు, ఆయన పార్టీకి, ఆయన్ను మోస్తున్న దుష్ట చతుష్టయానికి జ్ఞానోదయం కావాలని.. తద్వారా వారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడాన్ని ఆపుతారని ఆశిస్తున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement