మళ్లీ మన ప్రభుత్వమే: సీఎం జగన్‌ | CM YS Jagan Comments At AP Assembly Budget Sessions | Sakshi
Sakshi News home page

మళ్లీ మన ప్రభుత్వమే: సీఎం జగన్‌

Published Wed, Feb 7 2024 5:09 AM | Last Updated on Wed, Feb 7 2024 7:16 AM

CM YS Jagan Comments At AP Assembly Budget Sessions - Sakshi

శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్ర విభజన నుంచి ఇప్పటికి కూడా మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. మనం కలసికట్టుగా 60 ఏళ్లపాటు ఉమ్మడిగా హైదరాబాద్‌ను నిర్మించుకున్నాం. అది ఎకనామిక్‌ పవర్‌ పాయింట్‌. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌస్‌ ఉండాలి. లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. ‘ట్యాక్స్‌ బాయోన్సీ’ అన్నది చాలా చాలా ముఖ్యం. పెద్ద పెద్ద నగరాల్లోనే ట్యాక్స్‌ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. 

మేనిఫెస్టో హామీల్లో 99 శాతం వాగ్దానాలను ఈ ఐదేళ్లలో అమలు చేశాం. ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు కోరుతున్నాం. వైఎస్సార్‌సీపీ  చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా సరే కచ్చితంగా చేసి తీరుతుంది. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అఖండ మెజా­రిటీతో ప్రజల మన్ననలు పొంది మళ్లీ 3 నెలలకు ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడతాం.
 – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనతో ఏర్పడిన రెవెన్యూ లోటు, చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పెరిగిన ఆర్థిక సంక్షోభం, కోవిడ్‌ మహమ్మారి లాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొని గత నాలుగున్నరేళ్లుగా ప్రజలకు మంచి చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రెవెన్యూ లోటు, తగ్గిన ఆదాయం, పెరిగిన ఖర్చులు, కేంద్ర నిధుల తగ్గుదలను గణాంకాలతో సహా వివరించారు.

టీడీపీ హయాంలో రాబడి, అప్పులు, ఖర్చులను వైఎస్సార్‌సీపీ వచ్చాక ఎలా ఉందో వెల్లడిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు. అంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కూడా గత సర్కారు చేయని విధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తుచేశారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాలతో ప్రజలకు మొత్తం రూ.4.31 లక్షల కోట్లను అందించామన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వాస్తవాలను వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. 

► గత ప్రభుత్వ విధానాలతో కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత కుదేలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిన విడుదల చేసిన నివేదికను గమనిస్తే విద్యారంగంలో జీఈఆర్‌ రేషియో జాతీయ స్థాయిలో  96.91 శాతం ఉంటే మన రాష్ట్రంలో 83.29 శాతమే ఉంది. ఆ డేటా చూస్తే అమ్మ ఒడి పథకం ఎంత అవసరమో అందరికీ అర్థమవుతుంది. గత సర్కారు హయాంలో ప్రైమరీ స్కూళ్ల­లో విద్యార్థుల ఎన్‌రోల్‌లో రాష్ట్రం చివరిన మూడో స్థానంలో ఉంది. దాన్ని మనం ఏ స్థాయికి తీసుకొచ్చామో గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.  

► చంద్రబాబు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు.  రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారు. ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. మనం వచ్చాక రైతు భరోసా పథకం అందించి తోడుగా నిలిచాం. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అక్కచెల్లెమ్మలను చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేస్తానని దగా చేశారు. మనం అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాలకు జీవం పోశాం.  

► ‘ట్యాక్స్‌ బాయోన్సీ’ అన్నది అత్యంత ప్రధానం. పెద్ద పెద్ద సిటీల్లో ట్యాక్స్‌ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను విశాఖపట్నం గురించి గట్టిగా చెబుతా. జాతీయ స్థాయిలో జీడీపీ గమనిస్తే వ్యవసాయ రంగం నుంచి 18 శాతం ఉంటే తెలంగాణలో 17 శాతం ఉంది. మన రాష్ట్రంలో 34 శాతం వ్యవసాయ రంగం నుంచి ఉంది. మనది రైతులతో కూడిన ఎకానమీ. దీని వల్ల ఎబిలిటీ టూ జనరేట్‌ ట్యాక్స్‌ రెవెన్యూ తగ్గుతుంది.

హైదరాబాద్‌ లాంటి నగరం లేకపోవడం, విభజన వల్ల రాష్ట్రం ఏటా రూ.13 వేల కోట్లను ఆదాయపరంగా నష్టపోతున్నాం. ఈ పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లు నష్టపోయాం. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో చట్టంలోనైనా ప్రత్యేక హోదా ఇస్తామని పొందుపరచి ఉంటే మనం కోర్టుకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. చట్టంలో చేర్చకపోవడంతో ప్రత్యేక హోదా ఎండమావిగా మారిపోయింది. కేంద్రంలో అధికార పారీ్టకి పూర్తి మెజారిటీ లేకపోతే, మన మద్దతు అడిగిన వారిని మనం గట్టిగా డిమాండ్‌ చేయగలిగేవాళ్లం.   

► ఇన్ని ఇబ్బందులు, సవాళ్ల మధ్య మన ఆర్థిక వ్యవస్థను 56 నెలలుగా సమర్థంగా నడుపుతూ ముందడుగులు వేస్తున్నాం. ఎక్కడా అవినీతి అన్నదే లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేశాం. మన ప్రభుత్వం రాకముందు నిధులు అవినీతి లేకుండా ప్రజలకు చేరేవి కాదు. ఈరోజు బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తున్నాం. ఎక్కడ లంచాలు, వివక్ష లేదు. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. నాన్‌ డీబీటీ స్కీమ్స్‌ ద్వారా మరో రూ.1.07 లక్షల కోట్లు ఇచ్చాం. (ఇళ్ల స్థలాల మార్కెట్‌ విలువ కూడా తీసుకుంటే దాదాపు రూ.1.76 లక్షల కోట్లు ఉంటుంది)  

► మన ప్రభుత్వానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెబుతూ గోల చేస్తోంది. మన ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎక్కువ, మూలధన వ్యయం తక్కువ అని ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడని ఆరోపిస్తున్నారు. క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చంద్రబాబు హయాంలో సగటున రూ.15,227 కోట్లు కాగా మన ప్రభుత్వ పాలనలో రూ.17,757 కోట్లుగా ఉంది. నాడు– నేడు ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులను  తీర్చిదిద్దుతున్నాం. 

అదనంగా మూడు పోర్టులు నిర్మిస్తున్నాం.  
► ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసిందని గర్వంగా చెబుతున్నా. ఇచ్చిన హామీలను ఏకంగా 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు అందుకుంటున్న ప్రభుత్వం మనది మాత్రమే. ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం.   

► చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు. మొదటిసారి సీఎం అయి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. మూడు సార్లు సీఎం అయ్యారు. ఇన్నేళ్ల తరువాత కూడా ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి... అని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు. మరోసారి అవకాశం ఇస్తే ఇది చేస్తా అది చేస్తా అంటున్నారు. చంద్రబాబు ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశారు.

ఏ గ్రామంలోనైనా చంద్రబాబు ఫలానిది చేశారని చెప్పేందుకు ఒక్క బిల్డింగ్‌ కనిపించదు. స్కూళ్లన్నీ నిర్వీర్యం చేశారు. మరోసారి కొత్త ఎరలతో ఆ పెద్ద మనిషి బయలుదేరారు. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. హైదరాబాద్‌లో కూర్చొని అరడజను వాగ్ధానాలతో కిచిడి చేసి మేనిఫెస్టో రూపంలో తెచ్చారు.  మేనిఫెస్టోలో వందల హామీలు ఇస్తారు. ఎన్నికల తరువాత చెత్తబుట్టలో వేస్తారు. 

ఒక్క అబద్ధమాడితే 2014లోనే సీఎం అయ్యేవాడిని
2014 ఎన్నికల్లో మనకు 45 శాతం ఓట్లు వస్తే మనకంటే దాదాపుగా ఒక్క శాతం ఓట్లు అధికంగా పొంది చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.  మనకు చంద్రబాబుకు తేడా ఒక్క శాతం మాత్రమే. నాడు మనం కూడా రూ.87 వేల కోట్లు రైతుల రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇద్దామని చాలా మంది నాకు చెప్పారు. చేయలేనిది చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదని ఆ రోజు నేను చెప్పా.

ఆ రోజు నేను అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓటు తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా. ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడిని. కానీ ఈ రోజు కూడా నాకు రిగ్రేట్‌ లేదు. వెనక్కి వెళ్లి మళ్లీ అబద్ధం చెప్పను. నా నోట్లో నుంచి అబద్ధాలు రావు. నేను ఆ రోజు చేసిన పని వల్ల అధికారంలోకి రాకపోవచ్చు. కానీ విశ్వసనీయత అన్న పదానికి అర్థం జగనే అని ప్రజలు నమ్మారని గర్వంగా 
చెబుతున్నాను.  
కరోనా విపత్తు వల్ల రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం వివరాలు 

 రాష్ట్ర ఆదాయం తగ్గినా... 
► జఠిల పరిస్థితుల్లో మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. దేశంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. కోవిడ్‌తో రాష్ట్ర ఆదాయం తగ్గింది. అనుకోకుండా ఖర్చులు పెరిగాయి. సాధారణంగా ఏటా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కానీ గత ఐదేళ్లలో అనూహ్య పరిస్థితులు చూశాం.

కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా బాగా తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ తగ్గాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని నడిపించాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనతో వచ్చిన ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. రెవెన్యూ లోటును అధిగమిస్తూ గొప్ప పాలన అందించాం. 

► 2015– 2019లో రాష్ట్రంలో స్టేట్‌ ట్యాక్స్‌ రెవెన్యూ 13.29 శాతం పెరిగింది. ఆ ప్రకారం గ్రోత్‌ రేట్‌ ఉంటే మనకు 2019–24 మధ్య రూ.2,24,603 కోట్లు రావాలి. కానీ రాష్ట్రానికి కేవలం రూ.1,15,552 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ 12.76 శాతం ఉండటంతో అనుకున్న మేర మనకు నిధులు ఇవ్వలేకపోయింది. ఈ రకంగా కూడా రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చింది.  

ఆదాయం కోల్పోవడం, ఖర్చుల భారం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో కుదుపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు గమనిస్తే 2013– 14లో జీడీపీ రేషియో 50 శాతం ఉంది. వారు అనుసరించిన విధానాల వల్ల 2018 నాటికి డెట్‌ జీడీపీ రేషియోను  48 శాతానికి తగ్గించారు. కోవిడ్‌ వచ్చినప్పటి నుంచి ఇది 61 శాతానికి పెరిగింది. ఇవాళ 57 శాతం ఉంది.  

► 2015–2019 మధ్య కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే 35 శాతం ఇచ్చింది. చంద్రబాబు సర్కారుకు ఆ మాత్రమైనా లబ్ధి కలిగింది. కేంద్రం రాను రాను సెస్‌లు, సర్‌చార్జ్‌ల పేరుతో వాటాను తగ్గించింది. మన ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర పన్నుల్లో 31 శాతం వాటా మాత్రమే ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సి పన్నుల వాటా గమనిస్తే జీఎస్‌డీపీ 2018– 19లో రూ.32 వేల కోట్లు ఉండగా 2019–20లో రూ.28 వేల కోట్లుకు తగ్గింది. 2022– 2023లో రూ.24 వేల కోట్లకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది.
 రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల అప్పుల వివరాలు  

అప్పులపై పదే పదే అబద్ధాలు
► అబద్ధాల బ్యాచ్‌ చేసే మరో ఆరోపణ.. రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందట! నోటికి హద్దుపద్దు లేకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు చెబుతున్నారు. విభజన నాటికి రూ.1.53 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు దిగిపోయే నాటికి మొత్తంగా రూ.4,12,288 కోట్లు అప్పులున్నాయి. రూ. 4,12,288 కోట్లు అప్పు నుంచి మనం ప్రయాణం మొదలు పెడితే ఇప్పుడు రూ.7.03 లక్షల కోట్లకు చేరింది. చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల రేటు  21.78 శాతం ఉంటే మన హయాంలో కేవలం 12.13 శాతమే ఉంది. చంద్రబాబు సమయంలో బటన్లు లేవు, స్కీమ్‌లు లేవు. అప్పుడు ఉన్నది దోచుకో..పంచుకో..తినుకో మాత్రమే. 

► పరిమితి మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని కౌరవ సైన్యం ఆరోపణలు చేస్తోంది.  చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య పరిమితికి మించి రూ.28,457 కోట్లు అప్పులు చేశారు. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫార్సుల కంటే రూ.366 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. ఇది వాస్తవం కాదా? 

► టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పులు 7.5 శాతం ఉన్నాయి. అదే సమయంలో కేంద్రం అప్పులు 3.6 శాతమే ఉన్నాయి. మన హయాంలో కేంద్రం అప్పులు 6.5 శాతం ఉంటే మనం అప్పు చేసింది 5.6 శాతం మాత్రమే. అప్పుల పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ ఎలా చూసినా సరే గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి చాలా తేడా ఉందని గర్వంగా చెబుతున్నా.  

► మన ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఒకడు రూ.13 లక్షల కోట్లు అంటారు. మరొకడు రూ.10 లక్షల కోట్లు అంటారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్క కుటుంబానికీ  మంచి చేయలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎవరి బ్యాంకు ఖాతాలో ఎంత వేశారు? మన ప్రభుత్వం వచ్చాక ఎంత వేశాం? ఇంటింటికీ వెళ్లి చూడమని చెబుతున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌.. మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్‌ రేట్‌ అప్పటికంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది.

చంద్రబాబు మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా ప్రజల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఎందుకు  వేయలేకపోయారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కూడా ఆలోచించాలి. మా హయాంలో ప్రతి రూపాయికీ లెక్క ఉంది. ఆధార్‌ నంబర్లతో సహా బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తాం. ఎవరికి ఎంత ఇచ్చామో మేం చెప్పగలం. మరి టీడీపీ హయాంలో నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా? ఆ నిధుల్లో చంద్రబాబు తిన్నది ఎంత? దత్తపుత్రుడికి ఇచ్చింది ఎంత? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన ఎల్లో మీడియాకు ఇచ్చింది ఎంత?  
చంద్రబాబు పాలనాకాలంలో పెరిగిన రెవెన్యూ లోటు వివరాలు (పింక్‌ కలర్‌లో) 

బాబు పాలనంతా రెవెన్యూ లోటే
► మనం వెచ్చిస్తున్న  రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్నారే.. మరి రూ.1.24 లక్షల కోట్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే చంద్రబాబు సంపద సృష్టిస్తారంటూ ఎల్లో మీడియా డప్పు కొడుతోంది. చంద్రబాబు ట్రాక్‌ రికార్డు గమనిస్తే ఆయన సీఎం కాకమునుపు రెవెన్యూ మిగులు ఉండేది.  చంద్రబాబు సీఎం అయ్యాక ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ లోటే కనిపిస్తుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూ మిగులు ఉంది. చంద్రబాబు ప్రజలకు ఏ స్కీమ్‌ కూడా అమలు చేయలేదు. మరి ఎక్కడ సంపద సృష్టించారో ప్రజలు ఆలోచించాలి.  

చంద్రబాబు విజనరీ అయితే.. ఆయన పాలనలో రాష్ట్రం మెరుగుపడి ఉంటే  జీడీపీలో మన జీఎస్‌డీపీ వాటా ఎంత అని గమనించాలి. 2014–19లో రాష్ట్రం దేశానికి పన్నుల కింద 4.47 శాతం వాటా ఆదాయం ఇస్తే.. మన హయాంలో ఈ ఐదేళ్లలో 4.82 శాతం వాటా ఆదాయాన్ని కేంద్రానికి ఇచ్చాం. దీనిని బట్టి ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా, ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా, ఇన్ని పథకాలు అమలు చేస్తూనే ఈ స్థాయిలో జీఎస్‌డీపీ కేంద్రానికి ఇచ్చాం.  

► మనసు లేని నాయకుడు, మోసం చేసే నాయకుడు కేవలం వాగ్ధానాలు మాత్రమే చేస్తాడు. మనసున్న ప్రభుత్వం, అమలు చేసే నిజాలు చెబుతుంది. ఇదీ ఆయనకు, మనకు ఉన్న తేడా. చంద్రబాబుకు వాగ్ధానాలు అమలు చేసే ఉద్దేశం లేదు. అమలు చేసిన చరిత్ర అంత కన్నా లేదు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏ ఒక్కరైనా నమ్మడం అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే!  

► చంద్రబాబు రకరకాల మోసాలు చేశారు కాబట్టే ఆ పార్టీని 23 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే 151 స్థానాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఎన్నికలోనూ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్సార్‌ సీపీని గెలిపించారు. విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది. ఫలానా వ్యక్తి నమ్మకస్తుడనే గుర్తింపు సంపాదించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్సార్‌ సీపీ సంపాదించుకోగలిగిందని గర్వంగా చెబుతున్నా. ఈ రోజు కూడా చెబుతున్నా.. వైఎస్సార్‌ సీపీ చేయగలిగిందే చెబుతుంది. చెప్పింది ఏదైనా కూడా కచ్చితంగా మాట మీద నిలబడుతుందని వంద శాతం చెబుతున్నాను.  
టీడీపీ ఇప్పుడు ఇస్తున్న కొన్ని ఎన్నికల హామీలు అమలు చేయాలంటే అయ్యే ఖర్చు వివరాల అంచనా  

అధికారం కోసం అడ్డగోలు హామీలు
జగన్‌ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు! సంక్షేమ పథకాలతో అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుంది అని చంద్రబాబు ఇన్నాళ్లూ మాట్లాడారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అవే రాతలు రాశాయి. ఎన్నికలు వచ్చేసరికి జగన్‌ ఇంతేనా ఇచ్చేది? నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి, నిబద్ధత ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రజలను మోసం చేసేందుకు, దోచుకుని పంచుకునేందుకే వీళ్లకు అధికారం కావాలి.

చంద్రబాబు  మేనిఫెస్టో ఏది చూసినా ఇవే మోసాలు  కనిపిస్తాయి. 1995 నుంచి ఇప్పటివరకు చంద్రబాబు మేనిఫెస్టోల్లో 650 వాగ్దానాలు చేశారు. వాటిలో 10 శాతం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? ప్రజలను మరోసారి మోసగించేందుకే చంద్రబాబు ఆరు వాగ్దానాల పేరుతో వస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని నమ్మడం కరెక్టేనా? అని ప్రజలు ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబును నమ్మితే... బంగారు కడియం ఇస్తానని చెప్పి అమాంతంగా తినేసే పులిని నమ్మినట్టే. 

► ఇవాళ 66.34 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. దీనికి ఏడాదికి రూ.36 వేల కోట్లు అవుతుంది. ఉచిత విద్యుత్‌కు రూ.11 వేల కోట్లు ఖర్చు అవుతుంది. సబ్సిడీ కింద బియ్యం రూ.4,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108కు రూ.4,400 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,800 కోట్లు, సంపూర్ణ పోషణ, గోరుముద్ద  లాంటి 8 పథకాలకు ఏటా రూ.53 వేల కోట్లు ఖర్చు అవుతుంది. వీటిని ఎవరూ రద్దు చేయలేరు. 

► వాటికి చంద్రబాబు చెప్పిన 6 హామీలు అదనంగా చేరిస్తే.. మహాశక్తి పథకానికి రూ.36 వేల కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.12,400 కోట్లు, యువగళం పథకానికి రూ.7,200 కోట్లు,  దీపం పథకానికి రూ.4,634 కోట్లు, అన్నదాత పథకానికి రూ,10,706 కోట్లు కలిపి రూ.73 వేల కోట్లు అవుతుంది.  కచ్చితంగా అమలు చేయాల్సిన 8 పథకాలకు అయ్యే రూ.53 వేల కోట్లకు రూ.73 వేల కోట్లు కూడా కలిపితే రూ.1.26 లక్షల కోట్లు ఏటా ఖర్చు చేయాల్సి వస్తుంది. దుర్భుద్ధితో ప్రజలను దగా చేయడం చంద్రబాబుకు ధర్మమేనా?      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement