సంకటంలో ‘సంఘటన్‌’! | Mayawati gives big blow to Congress, says no alliance with Rahul's party for states polls | Sakshi
Sakshi News home page

సంకటంలో ‘సంఘటన్‌’!

Published Sun, Oct 7 2018 2:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Mayawati gives big blow to Congress, says no alliance with Rahul's party for states polls - Sakshi

కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌.డి. కుమారస్వామి ప్రమాణస్వీకార మహోత్సవంలో బీజేపీని వ్యతిరేకించే 12కిపైగా పార్టీల అధినేతలంతా ఒకే వేదికను పంచుకున్నారు. చేయిచేయి కలిపారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ ఒకరినొకరు పొగుడుకున్నారు. ఆ దృశ్యాలను చూసిన వారంతా అదిగదిగో మహాకూటమి ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటమే లక్ష్యంగా విపక్షాలన్నీ చేతులు కలుపుతున్నాయని భావించారు. కానీ ఆరు నెలలు తిరక్కుండానే మహాకూటమిపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైనట్టే కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ మహాకూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ వీసమెత్తు ప్రయత్నం కూడా చేయకుండా భాగస్వామి పార్టీలను ఓడించడానికే కంకణం కట్టుకుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర పక్షాలు ఒక్కతాటిపైకి రాకుండా ఎవరికి వారే యమునా తీరేగా పోటీకి దిగుతుండటంతో దీని ప్రభావం లోక్‌సభ పొత్తులపై ఎలా ఉంటుందోనన్న విశ్లేషణలు మొదలయ్యాయి.      – సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌


ఎందుకిలా జరిగింది?
‘‘సైద్ధాంతిక విభేదాలున్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ జాతీయ స్థాయి ఎజెండాతో ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడం సాధ్యం కాదు. ఎన్నికల తర్వాత కూటమి ఏర్పడవచ్చు కానీ, ముందే మహాకూటమి అనుకుంటే అయ్యే పనికాదు’’ అని మాయావతి తమతో పొత్తుకు రాంరాం చెప్పేశాక కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ స్పందన ఇది. రాజకీయంగా విభిన్నమైన పరిస్థితులు, భిన్న ఎజెండాలు కలిగిన పార్టీల మధ్య పొత్తుకి రాజకీయ, కార్యాచరణ అంశాలను కొలిక్కి తీసుకురావల్సి ఉంటుంది.

ముఖ్యంగా సీట్ల సర్దుబాటు వంటివి అత్యంత కీలకంగా మారతాయి. అలాంటి అంశాల్లో ఒక అవగాహనకు రాకుండానే, బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంగా అన్ని పార్టీలు కలుస్తాయనుకోవడం ఒట్టి భ్రమ అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి రాలేక మాయావతి మహాకూటమి నుంచి తప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌లో 50 సీట్లు కావాలని బీఎస్పీ పట్టుబడితే, 20కి మించి ఇవ్వలేమని కాంగ్రెస్‌ తేల్చేసింది.

బీఎస్పీ పోటీ చేయతలపెట్టిన సీట్ల జాబితాలో చాలావరకు ఆ పార్టీ గెలిచే ఆస్కారం లేనివే ఉన్నాయి. గెలవగలిగే సీట్లను ఆ పార్టీ కోరుకోలేదని ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ చెబుతున్నారు. ఎన్నికల పొత్తు విషయంలో బీఎస్పీ వైఖరిపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాయావతి హఠాత్తుగా కాంగ్రెస్‌కు ఎదురుతిరగడం వెనుక బీజేపీ ఒత్తిడి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్ని బూచిగా చూపించి బీజేపీ ప్రాంతీయ పార్టీలను బెదరగొడుతోందని, కాంగ్రెస్‌తో కలవకుండా అడ్డకుంటోందనే ప్రచారం కూడా జరుగుతోంది.

మాయాకు అసంతృప్తి ఎందుకు?
మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో దళితుల ప్రాబల్యం ఎక్కువ. వారి ఓట్లే అత్యంత కీలకం. అందుకే బీఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్‌ తుదివరకు ప్రయత్నించింది. కానీ సీట్ల పంపకం విషయంలో మాయావతి తీవ్రమైన అసంతృప్తికిలోనయ్యారు. రాజస్తాన్‌లో 9, మధ్యప్రదేశ్‌లో 15–20, ఛత్తీస్‌గఢ్‌లో 5–6 సీట్లే ఇస్తానని కాంగ్రెస్‌ తేల్చేయడంతో మాయావతి యూ టర్న్‌ తీసుకున్నారు. ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీఎస్పీ 6.3% ఓట్లను సాధించింది. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తమకు నష్టం జరుగుతుందనే అంచనాతో మహాకూటమికి మాయావతి గుడ్‌బై చెప్పేశారు.

రాజస్తాన్‌...
కాంగ్రెస్, బీఎస్పీ ఒకదానితో మరొకటి అన్ని స్థానాల్లోనూ తలపడనున్నాయి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ చేరింది. మరికొన్ని చిన్నాచితకా పార్టీలు కూడా వామపక్ష కూటమితోనే జత కలిశాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా ఈ కూటమితోనే కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి.  

మధ్యప్రదేశ్‌...
బీఎస్పీ ఒంటరిపోరాటానికే సిద్ధమైంది. 230 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. లెఫ్ట్‌ పార్టీలు కూడా ఇతర పార్టీలతో జతకట్టలేదు. ఇక సమాజ్‌వాదీ పార్టీ గోండ్వానా గణతంత్ర పార్టీతో కలసి పోటీ చేయనుంది.

ఛత్తీస్‌గఢ్‌...
కాంగ్రెస్‌ నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టిన అజిత్‌ జోగి జనతా కాంగ్రెస్‌తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. లెఫ్ట్‌ పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీ ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాయి. మాయావతి అజిత్‌ జోగితో చేతులు కలపడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి లాభం చేకూరే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌కే నష్టమా?
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు నష్టం తీసుకువస్తాయని, ఓట్లు చీలిపోవడం వల్ల బీజేపీకి లాభం కలుగుతుందనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ‘‘మధ్యప్రదేశ్‌లో బీఎస్పీకి అంతో ఇంతో పట్టు ఉంది. బీజేపీ వ్యతిరేక ఓట్లను కూడగట్టే సమర్థత మాయావతికి ఉంది. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించాం.

కానీ మాయావతి అత్యాశతో ఏకంగా 50 సీట్లు డిమాండ్‌ చేశారు. అన్ని సీట్లు ఇచ్చి రాజీపడాల్సిన అవసరమేముంది. ఆమె తొందరపడకపోతే మరో మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించేవాళ్లం’’ అని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్న 35 నియోజకవర్గాల్లోనూ, ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగి పార్టీతో జతకట్టడంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లలో బీఎస్పీ పైచేయి సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.


లోక్‌సభ ఎన్నికల్లోనైనా పొత్తు పొడుస్తుందా?
అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మహాకూటమి ఏర్పడకపోయినా లోక్‌సభ ఎన్నికల సమయానికి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయని కాంగ్రెస్‌ ఆశాభావంతో ఉంది. లోక్‌సభ ఎన్నికల నాటికి యూపీ, బిహార్‌లలో పొత్తులు కుదిరితే చాలని, మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇతరుల అవసరమేమీలేదని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హవాకు చెక్‌ పెట్టాలంటే విపక్షాల ఐక్యత అత్యంత ముఖ్యం.

ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బహిరంగంగానే చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్‌ వైఖరిపట్ల అసంతృప్తితో ఉంది. ‘‘పొత్తులు పొడవాలంటే కాంగ్రెస్‌ వంటి పార్టీలకు పెద్ద మనసు ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో మా అవసరం లేదన్నట్టు కాంగ్రెస్‌ వ్యవహరిస్తోంది. ఆ పార్టీ యూపీలో స్థాయికి మించి సీట్లు అడిగితే మా ధోరణి కూడా అలాగే ఉంటుంది’’ అని సమాజ్‌వాదీ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాల స్థాయిలో బీజేపీయేతర పార్టీల మధ్య విభేదాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి సర్దుకుంటాయా అన్నది అనుమానమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement