రాహుల్ గాంధీ, మాయావతి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఉపాధ్యక్షుడు జై ప్రకాశ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షురాలు మాయావతి మంగళవారం తీవ్రంగా స్పందించారు. పార్టీ ఉపాధ్యక్ష, జాతీయ సమన్వయకర్త పదవుల నుంచి జై ప్రకాశ్ సింగ్‌ను తొలగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు విప్ జారీ చేసినట్లు వివరించారు.
తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మాత్రమే ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కోగలరని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త జై ప్రకాశ్ సింగ్ పేర్కొన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మాయావతే ప్రధాన మంత్రి అభ్యర్థి అని వెల్లడించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పదవి దక్కదని, ఎందుకంటే ఆయన తల్లి విదేశీయురాలు కావడమే కారణమని పేర్కొన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ వైఖరిని తెలియజేసేందుకు సోమవారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జై ప్రకాశ్ వివాదాస్పదంగా మాట్లాడటం గమనార్హం. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన మాయావతి జై ప్రకాశ్‌పై వేటు వేశారు. జై ప్రకాశ్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారని ఆమె అన్నారు. ఈ ఏడాది మూడు రాష్ట్రాల్లో(మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్) జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు బీఎస్పీ ప్రయత్నిస్తోంది.
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీతో కలసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. అయితే, రాజస్థాన్‌లో మాత్రం బీఎస్పీతో కలసి ఎన్నికల బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment