సాక్షి, న్యూఢిల్లీ : 2017లో మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అనుభవమే ఇప్పుడు మేఘాలయలో ఆ పార్టీకి పునరావతం అయింది. రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం అయింది. కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు వచ్చాయి. కానీ 19 సీట్లను సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎన్‌పీపీ నాయకుడు కన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మణిపూర్‌లో నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలున్నా సకాలంలో స్పందించి పావులు కదపడంలో పార్టీ కేంద్ర నాయకత్వం విఫలమైంది. బీజేపీ నుంచి పొంచి ఉన్న ముప్పును తాము సకాలంలో అంచనా వేయలేపోయామని నాడు కాంగ్రెస్ నాయకత్వం సమర్థించుకుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని చెప్పింది. అందుకని ఈ సారి పార్టీ సీనియర్ నాయకులు కమల్‌నాథ్, అహ్మద్ పటేల్ సకాలంలో షిల్లాంగ్‌కు చేరుకొని పార్టీ నాయకత్వంలో మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశంలో ఉండకుండా విదేశాలకు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. షిల్లాంగ్ చర్చల వైఫల్యాన్ని ముందుగానే ఊహించి రాహుల్ జారుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంటే సమస్యలను దగ్గరుండి పరిష్కరించే సామర్థ్యం లేదనేది విమర్శల సారాంశం. ఈశాన్య రాష్ట్రాల్లోని పార్టీలు ఎప్పుడైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలవైపే పొత్తుకు మొగ్గు చూపుతాయనడంలో సందేహం లేదుగానీ ఇక్కడ మేఘాలయలో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయినప్పటికీ ఆ పార్టీ వేల కోట్ల అభివద్ధి నిధులను ఆశగా చూపి పార్టీలను ప్రలోభపెట్టి ఉండాలి. కేంద్రంలోని బీజేపీ మేఘాలయ అభివద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఎప్పుడు అస్థిర ప్రభుత్వాలకు నెలవైన మేఘాలయలో ఈసారి కూడా పూర్తికాలం పాటు అధికారంలో కొనసాగుతుందా? ప్రశ్న తలెత్తక మానదు. ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ ఉండదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్‌పీపీ రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన గారో హిల్స్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఇక యూడీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఖాసీ పార్టీలు. హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అయితే ప్రత్యేక ఖాసీ రాష్ట్రం కోసం పోరాటం జరిపింది. ఇక భారతీయ జనతా పార్టీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ. ఈ మూడు పార్టీల వైఖరిలు పూర్తి భిన్నమైనందున పొత్తు ఎలా కొనసాగుతుందన్నది ప్రధాన ప్రశ్న. కేంద్రం అండ చూసుకొని బీజేపీ అహంకారంతో వ్యవహరించే అవకాశం కూడా ఉంది. అన్ని పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రభుత్వ సుస్థిరతను కాపాడుకుంటూ రాష్ట్ర అభివద్ధికి కషి చేయాల్సిన బాధ్యతను సంగ్మా ఎంతమేరకు నెరవేరుస్తారో కాలమే చెప్పాలి!
Comments
Please login to add a commentAdd a comment