Meghalaya government
-
మేఘాలయా: మారిన సీన్.. ఎన్పీపీ-బీజేపీకి షాక్!
షిల్లాంగ్: నేషనల్ పీపుల్స్ పార్టీతో(ఎన్పీపీ)తో జత ద్వారా మరోసారి అధికార పీఠం ఎక్కాలనుకున్న బీజేపీకి షాక్ తగలనుందా?. మొత్తం 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనుకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కలిశారు ఎన్పీపీ చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా. అయితే ఆపై కొన్ని గంటలకే అక్కడ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. 26 మంది సొంత పార్టీ సభ్యులతో పాటు బీజేపీ(ఇద్దరు), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెస్‌ఎస్‌పీడీపీ నుంచి ఇద్దరు), మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు తమకే ఉందని, మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం కల్పించాలని గవర్నర్ ఫగు చౌహాన్‌కు లేఖ సమర్పించారు కాన్రాడ్ సంగ్మా. తదనంతరం.. మార్చి 7వ తేదీన ప్రమాణస్వీకరానికి ముహూర్తం ఖరారు చేసినట్లు, ప్రధాని మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారాయన. అయితే.. ఇది జరిగిన కొద్దిగంటలకే హెచ్ఎస్పీడీపీ షాక్ ఇచ్చింది. తొలుత హెచ్ఎస్పీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఎన్పీపీకి బహిరంగంగా ప్రకటించారు. అయితే.. ఎన్పీపీ-బీజేపీలకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ చీఫ్ స్వయంగా ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది ఆ పార్టీ. మరోవైపు యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) అధ్యక్షుడు మెట్బా లింగ్డో.. తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి ఆసక్తిని రేకెత్తించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని తెలిపారాయన. యూడీపీతో పాటు టీఎంసీ, కాంగ్రెస్, పీడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకు ఉందని ప్రకటించారాయన. ఈ మేరకు ఆయా పార్టీల సమావేశం జరగ్గా.. కూటమిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చర్చలు కొనసాగుతున్నాయని టీఎంసీ నేత.. మాజీ సీఎం ముకుల్ సంగ్మా మీడియాకు వెల్లడించారు. బీజేపీ, ఎన్పీపీ తప్ప అన్ని పార్టీలు ఇవాళ ఇక్కడ హాజరయ్యాం. అంకెల గారడీ ఎవరైనా చేస్తారు. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు చూశాం. కానీ, ఇక్కడ అలా కాదు. మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటు అంత ఈజీ కాదు. త్వరలోనే మా కూటమిపై ఓ స్పష్టత ఇస్తాం అని పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. యూడీపీ 11 సీట్లు, టీఎంసీ ఐదు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ రెండు సీట్లు దక్కించుకుంది. మొత్తం 60 స్థానాలకుగానూ 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి అక్కడ(ఒక చోట సిట్టింగ్ అభ్యర్థి మరణంతో ఎన్నిక నిర్వహణ నిలిపివేశారు). గురువారం త్రిపుర, నాగాలాండ్‌తో పాటు ఫలితాలు వెల్లడించగా, మేఘాలయాలోనే ఇలా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. -
మందు బాబులకు షాక్.. కొత్త ఏడాది లిక్కర్ బంద్..!
షిల్లాంగ్: మరి కొద్దిరోజుల్లో 2021 ఏడాది ముగియనుంది. అయితే క్రమంలో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి జనాలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఏడాది చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు మద్యం గిరాకీ బాగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే మేఘాలయలో మాత్రం ఈ నెల 24, 25 తేదీలతో పాటు కొత్త సంవత్సరం మొదటి రోజైన జవనవరి 1న కూడా మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించి మందు బాబులకు షాకిచ్చింది. అయితే ఈ నిషేధం రాష్ట్ర మొత్తం లేకుండా ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో మాత్రమే ఉండనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి జీవోను మేఘాలయ ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. (చదవండి: నళినికి నెల రోజుల పెరోల్) -
కరోనా: ఒక్కరోజు బస్సులు బంద్!
షిల్లాంగ్: కరోనా భయాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తత ప్రకటించాయి. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు ఈ నెల 31 వరకు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా మేఘాలయా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కరోజుపాటు పూర్తిగా ప్రజా రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. మార్చి 20 అర్ధరాత్రి నుంచి మార్చి 21 అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని తెలిపింది. దాంతోపాటు దుకాణాలు, మార్కెట్లు మూసేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతామని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా 209 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు. (చదవండి: కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు) (చదవండి: కోవిడ్-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు) -
అక్కడ 24 గంటలకు మించి ఉంటే ఆంక్షలే!
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రవాసులు కాకుండా.. బయటి వ్యక్తులు ఎవరైనా.. 24 గంటలకు మించి మేఘాలయాలో ఉండాలనుకుంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఈ మేరకు మేఘాలయా వాసుల కోసం ఉద్దేశించిన భద్రతా చట్టం 2016 (ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏ)లో సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మేఘాలయా రాష్ట్రంలోకి ప్రవేశించే బయటి వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలు అధికారుల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా కౌన్సిల్ ఉద్యోగులకు ఈ చట్టం వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు రూపొందించిన ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏను 2016లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. భద్రత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాజా సవరణ ప్రతిపాదించినట్టు చెప్పారు. మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ బయటి వ్యక్తులు సులువుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు ప్రతిపాదిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం, నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే.. చట్ట ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారని అన్నారు. అసోంలో భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) అమలు చేసి గత ఆగస్టులో 19 లక్షల మందిని అసోం పౌరులుగా గుర్తించలేదు. కాగా అసోం తరహాలోనే మేఘాలయ ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించి చర్యలు చేపట్టనుంది. -
ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమే!
సాక్షి, న్యూఢిల్లీ : 2017లో మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన అనుభవమే ఇప్పుడు మేఘాలయలో ఆ పార్టీకి పునరావతం అయింది. రాష్ట్ర అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం అయింది. కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు వచ్చాయి. కానీ 19 సీట్లను సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎన్పీపీ నాయకుడు కన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మణిపూర్‌లో నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలున్నా సకాలంలో స్పందించి పావులు కదపడంలో పార్టీ కేంద్ర నాయకత్వం విఫలమైంది. బీజేపీ నుంచి పొంచి ఉన్న ముప్పును తాము సకాలంలో అంచనా వేయలేపోయామని నాడు కాంగ్రెస్ నాయకత్వం సమర్థించుకుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని చెప్పింది. అందుకని ఈ సారి పార్టీ సీనియర్ నాయకులు కమల్‌నాథ్, అహ్మద్ పటేల్ సకాలంలో షిల్లాంగ్‌కు చేరుకొని పార్టీ నాయకత్వంలో మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశంలో ఉండకుండా విదేశాలకు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. షిల్లాంగ్ చర్చల వైఫల్యాన్ని ముందుగానే ఊహించి రాహుల్ జారుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంటే సమస్యలను దగ్గరుండి పరిష్కరించే సామర్థ్యం లేదనేది విమర్శల సారాంశం. ఈశాన్య రాష్ట్రాల్లోని పార్టీలు ఎప్పుడైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలవైపే పొత్తుకు మొగ్గు చూపుతాయనడంలో సందేహం లేదుగానీ ఇక్కడ మేఘాలయలో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయినప్పటికీ ఆ పార్టీ వేల కోట్ల అభివద్ధి నిధులను ఆశగా చూపి పార్టీలను ప్రలోభపెట్టి ఉండాలి. కేంద్రంలోని బీజేపీ మేఘాలయ అభివద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు అస్థిర ప్రభుత్వాలకు నెలవైన మేఘాలయలో ఈసారి కూడా పూర్తికాలం పాటు అధికారంలో కొనసాగుతుందా? ప్రశ్న తలెత్తక మానదు. ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ ఉండదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్పీపీ రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన గారో హిల్స్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఇక యూడీపీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఖాసీ పార్టీలు. హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అయితే ప్రత్యేక ఖాసీ రాష్ట్రం కోసం పోరాటం జరిపింది. ఇక భారతీయ జనతా పార్టీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ. ఈ మూడు పార్టీల వైఖరిలు పూర్తి భిన్నమైనందున పొత్తు ఎలా కొనసాగుతుందన్నది ప్రధాన ప్రశ్న. కేంద్రం అండ చూసుకొని బీజేపీ అహంకారంతో వ్యవహరించే అవకాశం కూడా ఉంది. అన్ని పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రభుత్వ సుస్థిరతను కాపాడుకుంటూ రాష్ట్ర అభివద్ధికి కషి చేయాల్సిన బాధ్యతను సంగ్మా ఎంతమేరకు నెరవేరుస్తారో కాలమే చెప్పాలి! -
పనీపాటా లేకుండా.. కోట్లు నొక్కేశారు!
షిల్లాంగ్: కొందరు ఉద్యోగులు ఏ పనీపాటా లేకుండా ఎనిమిదేళ్లలో రూ.5.69 కోట్లు సంపాదించారు. ఇంకా చెప్పాలంటే ఓవరాల్‌గా 34.42 కోట్ల అవినీతి జరిగిందని గుర్తించారు. మేఘాలయ డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ లాటరీస్(డీఎస్ఎల్)కు సంబంధించి ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదికలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆ రిపోర్ట్ ప్రకారం.. 2001లో మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్ఎల్ పథకాన్ని ప్రారంభించింది. అయితే 2008లో ఆ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. కానీ ఉద్యోగులు మాత్రం పనిచేస్తున్నట్లుగా సంబంధిత రిజిస్టర్లో ప్రతిరోజు దాదాపు ఎనిమిదేళ్లు సంతకాలు చేశారు. 27 మంది ఉద్యోగులు డీఎస్ఎల్ కింద విధులకు హాజరవుతున్నట్లుగా రికార్డులు సృష్టించారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, టాక్సేషన్, స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఇలా ఏ డిపార్ట్మెంట్లలోనూ వీరు పని చేయకుండా ఏకంగా 5.69 కోట్లు రాబట్టుకున్నారు. డీఎస్ఎల్ లో 112 మంది ఉద్యోగులు ఉండాలి కానీ, అది రద్దయిన తర్వాత 27 మంది మాత్రం పనిచేస్తున్నట్లుగా చూపించారని కాగ్ వెల్లడించింది. మేఘాలయ స్టేట్ లాటరీ రూల్స్ 2002 ప్రకారం, స్టేట్ లాటరీ స్కీమ్స్ రెగులేటెడ్ అండర్ ద లాటరీస్ (రెగ్యులేషన్) యాక్ట్ 1988 ప్రకారం రూ.34.42 కోట్ల అవినీతి జరిగినట్లు కాగ్ గుర్తించింది. ఫెస్టివల్స్ అనే సాకుతో మరో 12.44 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు వెలుగుచూసింది. ఈ అక్రమాలు, అవినీతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.