షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్రవాసులు కాకుండా.. బయటి వ్యక్తులు ఎవరైనా.. 24 గంటలకు మించి మేఘాలయాలో ఉండాలనుకుంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఈ మేరకు మేఘాలయా వాసుల కోసం ఉద్దేశించిన భద్రతా చట్టం 2016 (ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏ)లో సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం మేఘాలయా రాష్ట్రంలోకి ప్రవేశించే బయటి వ్యక్తులు తప్పనిసరిగా తమ వివరాలు అధికారుల వద్ద నమోదు చేయాల్సి ఉంటుంది. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా కౌన్సిల్ ఉద్యోగులకు ఈ చట్టం వర్తించదని వెల్లడించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు రూపొందించిన ఎంఆర్‌ఎస్‌ఎస్‌ఏను 2016లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. భద్రత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాజా సవరణ ప్రతిపాదించినట్టు చెప్పారు.
మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్
బయటి వ్యక్తులు సులువుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా నిబంధనలు ప్రతిపాదిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం, నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే.. చట్ట ప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారని అన్నారు. అసోంలో భారత పౌరులను గుర్తించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ) అమలు చేసి గత ఆగస్టులో 19 లక్షల మందిని అసోం పౌరులుగా గుర్తించలేదు. కాగా అసోం తరహాలోనే మేఘాలయ ప్రభుత్వం అక్రమ వలసదారులను గుర్తించి చర్యలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment