మద్దతుదారులతో గవర్నర్‌ను కలిసిన కాన్రాడ్ సంగ్మా(మధ్యలో గవర్నర్ ఫగు)
షిల్లాంగ్: నేషనల్ పీపుల్స్ పార్టీతో(ఎన్‌పీపీ)తో జత ద్వారా మరోసారి అధికార పీఠం ఎక్కాలనుకున్న బీజేపీకి షాక్ తగలనుందా?. మొత్తం 32 మంది ఎమ్మెల్యేల మద్దతు తనుకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కలిశారు ఎన్‌పీపీ చీఫ్, తాజా మాజీ సీఎం కాన్రాడ్ సంగ్మా. అయితే ఆపై కొన్ని గంటలకే అక్కడ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది.
26 మంది సొంత పార్టీ సభ్యులతో పాటు బీజేపీ(ఇద్దరు), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెస్‌ఎస్‌పీడీపీ నుంచి ఇద్దరు), మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు తమకే ఉందని, మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం కల్పించాలని గవర్నర్ ఫగు చౌహాన్‌కు లేఖ సమర్పించారు కాన్రాడ్ సంగ్మా. తదనంతరం.. మార్చి 7వ తేదీన ప్రమాణస్వీకరానికి ముహూర్తం ఖరారు చేసినట్లు, ప్రధాని మోదీ సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారాయన. అయితే.. ఇది జరిగిన కొద్దిగంటలకే హెచ్‌ఎస్‌పీడీపీ షాక్ ఇచ్చింది.
తొలుత హెచ్‌ఎస్‌పీడీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఎన్‌పీపీకి బహిరంగంగా ప్రకటించారు. అయితే.. ఎన్‌పీపీ-బీజేపీలకు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ చీఫ్ స్వయంగా ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది ఆ పార్టీ. మరోవైపు యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) అధ్యక్షుడు మెట్బా లింగ్డో.. తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి ఆసక్తిని రేకెత్తించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని తెలిపారాయన. యూడీపీతో పాటు టీఎంసీ, కాంగ్రెస్, పీడీఎఫ్, హెచ్‌ఎస్‌పీడీపీతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకు ఉందని ప్రకటించారాయన.
ఈ మేరకు ఆయా పార్టీల సమావేశం జరగ్గా.. కూటమిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చర్చలు కొనసాగుతున్నాయని టీఎంసీ నేత.. మాజీ సీఎం ముకుల్ సంగ్మా మీడియాకు వెల్లడించారు. బీజేపీ, ఎన్‌పీపీ తప్ప అన్ని పార్టీలు ఇవాళ ఇక్కడ హాజరయ్యాం. అంకెల గారడీ ఎవరైనా చేస్తారు. ఇంతకు ముందు పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు చూశాం. కానీ, ఇక్కడ అలా కాదు. మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటు అంత ఈజీ కాదు. త్వరలోనే మా కూటమిపై ఓ స్పష్టత ఇస్తాం అని పేర్కొన్నారాయన.
ఇదిలా ఉంటే.. యూడీపీ 11 సీట్లు, టీఎంసీ ఐదు, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ రెండు సీట్లు దక్కించుకుంది. మొత్తం 60 స్థానాలకుగానూ 59 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి అక్కడ(ఒక చోట సిట్టింగ్ అభ్యర్థి మరణంతో ఎన్నిక నిర్వహణ నిలిపివేశారు). గురువారం త్రిపుర, నాగాలాండ్‌తో పాటు ఫలితాలు వెల్లడించగా, మేఘాలయాలోనే ఇలా ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment