షిల్లాంగ్: మేఘాలయాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు. గురువారం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్ల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 60 స్థానాలకు మెజార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 31ని ఆయన పార్టీ అందులేకపోయింది.
కానీ తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 32 సభ్యుల బలముందని సంగ్మా తెలిపారు. ఎవరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎన్‌పీపీకి బీజేపీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది.
కాగా.. కాన్రాడ్ సంగ్మా మేఘాయల గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈనెల 7న ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం.
గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, ఎన్‌పీపీ ఈసారి విడిపోయి ఒంటరిగా పోటి చేశాయి. బీజేపీ తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడంతో సంగ్మా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లారు. 2018 కంటే ఏడు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్‌కు చెరో ఐదు సీట్లు వచ్చాయి. ఎన్‌పీపీ మాజీ మిత్రపక్షం యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. త్రిపురలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్‌లో కూడా బీజేపీ కూటమే విజయం సాధించింది. మేఘాలయలో కూడా ఎన్‌పీపీకే ఆ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఈ ప్రభుత్వంలో కూడా భాగం కానుంది.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment