
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రపంచస్థాయి పరిశ్రమలు నెలకొల్పుతామని ఆంధ‍్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రెండు మూడు నెలల్లో తీసుకువచ్చే స్పష్టమైన పాలసీ విధానం ద్వారా పారిశ్రామికవేత్తలను త్వరలోనే బిల్ గేట్స్, అంబానీ, అదానీలుగా మారుస్తామని పేర్కొన్నారు. నెల్లూరులో బుధవారం జరిగిన 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పారిశ్రామిక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ప్రతి మూడు నెలలకోసారి పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ, వాటికి పరిష్కార మార్గాన్ని కనుగొంటామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణనిచ్చి శ్రామికశక్తి స్థాయిని పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కసరత్తు మొదలైందన్నారు.
మాటలకే పరిమితమయిన గత ప్రభుత్వం
రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం ప్రజలను మాటలతో మభ్యపెట్టిందే తప్ప అభివృద్ధి చేయడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ లక్ష్యాలను, సాధించిన గణాంకాలను పరిశీలిస్తే వాళ్ల పాలన ఏ పాటిదో తెలుస్తుందన్నారు. పరిశ్రమలకు నీరు, విద్యుత్, ప్రోత్సాహకాలు ఏవీ చెల్లించకుండా మాట తప్పారని ఆరోపించారు. గత ప్రభుత్వ విధివిధానాల్లో లోపాల వల్లే ప్రస్తుత పారిశ్రామిక రంగంలో గందరగోళం నెలకొనడంతోపాటు పాలసీ ఆలస్యానికి కారణం అవుతోందన్నారు. వారికి ముందుచూపు లేకనే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. వాళ్లు తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల ఒక తరం భవిష్యత్ అంధకారంలో పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని అడ్డంకులను తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తయారు చేస్తామన్నారు.
పరిశ్రమలు వెనక్కు వెళ్లట్లేదు: మంత్రి
పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయనే వార్తలను మంత్రి ఖండించారు. పాత సమస్యలకు పరిష్కారం చూపాకే కొత్త పరిశ్రమలు స్థాపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం అదృష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. జలవనరుల శాఖ మంత్రిగా పదవి చేపట్టిన 2 నెలల్లోనే అనిల్ కుమార్ యాదవ్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే వరప్రసాద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం.వీ శేషగిరి బాబు, ఇతర పరిశ్రమల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment