సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడంతో అధికారుల ఆదేశాల మేరకు బయట ప్రాంతాల నుంచి వచ్చిన నియోజకవర్గయేతరులు వెళ్లిపోవాలని ఆర్వో, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. పక్షం రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి.
నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టంగా చేపట్టాయి. వైఎస్సార్‌సీపీ మండలానికి ఒక మంత్రిని ఇన్‌చార్జిగా నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి, పనితీరు, సంక్షేమ పాలనకు దర్పంగా ఆత్మకూరు తీర్పు ఉండాలని ప్రజల్ని కోరారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అండగా నిలిచినట్లే ఆయన సోదరుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డిని ఆశీర్వదించాలని గ్రామాలను చుట్టేస్తూ ప్రజల్ని కోరారు. అర్హతే ప్రామాణికంగా అందించిన సంక్షేమ పాలన కారణంగా ఘనమైన మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వాసం ప్రదర్శిస్తున్నారు.
సంకటస్థితిలో బీజేపీ
తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల తరహాలో ఆత్మకూరులోనూ బీజేపీ అగ్రనేతలంతా రంగ ప్రవేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జితో పాటు, రాజ్యసభ సభ్యులు,, మాజీ కేంద్ర మంత్రులు ఆత్మకూరులో తిష్ట వేసి ఆ పార్టీ శ్రేణులను నడిపించారు. బీజేపీ అభ్యరి్థని గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాగా అభ్యర్థి భరత్‌కుమార్ నాన్‌లోకల్ కావడంతో ఆ సమస్య బీజేపీని వెంటాడుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీస పరువు నిలుపుకునే స్థాయిలో ఓట్లు దక్కితే చాలు అన్నట్లు ఆ పార్టీ నేతల వైఖరి కనిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీరికి ఈ దఫా బీఎస్పీ నుంచి గట్టి పోటీ తప్పడం లేదు. గతంలో కాస్తా తక్కువ ఓట్లతో బీజేపీ కంటే వెనుకబడిన బీఎస్పీ ఈ దఫా అధిగమించేందుకు విశేషంగా ప్రయత్నించింది. ఆ మేరకు ప్రజల చెంతకు చేరి పోటాపోటీగా ప్రచారం చేపట్టారు.
మెజార్టీపైనే అందరి అంచనాలు
నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జి భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థి ఎన్ ఓబులేసులు ప్రధానంగా తలపడుతుండగా బరిలో మొత్తం 14 మంది ఉన్నారు. అయితే ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి తిరిగి పార్టీ అమలు చేస్తున్న నవరత్న పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో 2,13,138 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య అధికంగా 1,07,367 కాగా, పురుష ఓటర్లు 1,05,960 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం ఓ ట్లు పోల్ కాగా, ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఏ మేరకు నమోదు అవుతుందో వేచి చూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపుతాం
Comments
Please login to add a commentAdd a comment