
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి.
ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ‍్వలేదు. ఇక, పోస్టల్ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్‌సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యం సాధించింది.
కాగా, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment