
సాక్షి : గ్రహాంతర వాసులు ఉన్నయా? అన్న చర్చ జరిగినప్పుడల్లా... జరిగిన ఘటనలు.. సాక్ష్యాలు మాత్రం అది నిజమేమోనన్న వాదనను తెరపైకి తెస్తుంటాయి. దీనికితోడు స్టీఫెన్ హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఈ విశ్వంలో మనకు తెలియని ప్రపంచాలు బోలెడు ఉన్నాయని.. ఎలియన్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కూడా. అదే సమయంలో రాజకీయ వేత్తలు, మేధావులు, సెలబ్రిటీలు కూడా తామూ ఫ్లైయింగ్ సాసర్(ఏలియన్లు వాడే వాహనాలు) లాంటి వాటిని చూశామని చెప్పటం చూశాం.
అయితే అమెరికాలోని మియామి కి చెందిన ఓ పొలిటీషియన్ మాత్రం ఏలియన్లు ఏకంగా తనను కిడ్నాప్ చేశాయని వెల్లడించటం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. 59 ఏళ్ల బెట్టినా రోడ్రిగుజ్ అగులెరా మియామి స్థానానికి రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా కాంగ్రెస్‌కు పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఆమె ఏలియన్ ఇంటర్వ్యూలు చక్కర్లు కొడుతున్నాయి.
తనకి ఏడేళ్ల వయసులో ఉన్న సమయంలో ఆడుకోమ్మని తల్లిదండ్రులు బయటకు పంపించగా.. ఏలియన్లు తనను తమ వెంట తీసుకెళ్లాయని ఆమె చెప్పారు. ‘మొత్తం మూడు ఏలియన్లు అక్కడ ఉన్నాయి. అవి నన్ను స్పేస్ షిప్‌లోకి తీసుకెళ్లి కాసేపు మాట్లాడాయి. ఓ విమానం లాగే అది ఉన్నప్పటికీ గుండ్రటి ఆకారంలో ఉంది. లోపల సీట్లు.. ఇతర పరికరాలు చాలా తేడాగా ఉన్నాయి. వాటి భాష నాకు అర్థం అవుతోంది. రియో డి జనెరియోలోని జీసస్ విగ్రహం గురించి అవి ప్రస్తావించాయి. భగవంతుడు అంటే మనిషి కాదు.. ఓ శక్తి మాత్రమేనని అవి నాతో చెప్పాయి. దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ, అది అర్థం చేసుకునే శక్తి మనుషులకు లేదు. ఈ విశ్వంలో ఒక్క మతం మాత్రమే ఉంది’ అని అవి నాకు వివరించాయి అని ఆమె తెలిపారు.
ఆపై అవి తనని ఇంటి వద్ద వదిలేశాయని ఆమె అన్నారు. ఆ తర్వాత కూడా టెలీపతి విధానం ద్వారా అవి తరచూ తనతో మాట్లాడేవని.. ఏఎస్‌ఐఎస్(ఉగ్రవాద సంస్థ కాదు) అనే ఈజిప్ట్ దేవత గురించి చెప్పాయని.. మాల్టా దీవుల్లో 30 వేల అస్థిపంజరాల గురించి.. సౌత్ ఫ్లోరిడాలోని కొరల్ కాస్ట్లే పిరమిడ్ చరిత్ర గురించి తనతో చర్చించాయని బెట్టినా చెప్పుకొచ్చింది.
ఆమె వాదన అసంబద్ధం...
రోడ్రిగుజ్ చెప్పే వాటిని కొట్టిపడేసే వాళ్లు లేకపోలేదు. ఆమె చెప్పేది చాలా అసంబద్ధంగా ఉంది. ఇలాంటి ప్రకటనల ద్వారా ఆమె గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు. ప్రజలు ఆమెను గుడ్డిగా నమ్మే ప్రసక్తే లేదు అని రిక్ యాబొర్ అనే రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. దీనికి తోడు ఆమెకు పోటీ ఇస్తున్న రిపబ్లికన్ అభ్యర్థులు బ్రూనో బార్రిరో, రఖ్యూల్ రెగలదో.. ట్రాక్ రికార్డుల ఆధారంగా ప్రజలు వారిపై ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారని రిక్ అంటున్నారు.
డొరల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలిగా పని చేసిన ఆమె.. తర్వాత వైస్ మేయర్‌గా కూడ ఆకొంత కాలం విధులు నిర్వహించారు. రెండేళ్ల క్రితం మహిళల కోసం నెలకొల్పిన ఓ ఇనిస్టిట్యూట్‌లో సహ భాగస్వామిగా ఉన్న ఆమెకు.. రాజకీయంగా మంచి పరపతి ఉంది. అయితే ఎటొచ్చి ప్రచారం కోసం బెట్టినా ఏలియన్ల కథను మళ్లీ తెరపైకి తీసుకురావటంతో.. అది ఆమె విజయానికి ఏ మేర సహకరిస్తుందన్నది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment