చంద్రబాబుకు మంత్రి బొత్సా సవాల్‌ | Minister Botsa Satyanarayana Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ దుష్ప్రచారం: బొత్స

Published Mon, Nov 18 2019 5:47 PM | Last Updated on Mon, Nov 18 2019 6:39 PM

Minister Botsa Satyanarayana Fires On TDP Leaders - Sakshi

సాక్షి, అనంతపురం: రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చారిత్రక అవసరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారని పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియం చదువులకు.. మత మార్పిడులకు లింకు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని అమరావతి పనుల్లో సింగపూర్ ప్రభుత్వంతో పరస్పర అంగీకారంతో కాంట్రాక్టు రద్దు చేసుకున్నట్లు వివరించారు. ఏపీ అభివృద్ధి కి విపక్షాలు అడ్డుపడటం సరికాదని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి.. టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన ఓ చరిత్ర అని ప్రస్తుతించారు. అనంతపురం జిల్లాలో మరో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక అందుబాటులోకి వచ్చిందన్నారు. మ్యుచువల్‌ కన్సెంట్‌తోనే సింగపూర్‌ రాజధాని ఒప్పందం విరమించుకున్నామన్నారు. ఈ విరమణ వల్ల పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది లేదని, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని చెప్పారని పేర్కొన్నారు.

ఇంగ్లీష్‌ చదువుకు, మత మార్పిడికి సంబంధం ఏమిటి ?
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన అతిపెద్ద సంస్కరణల్లో భాగమని తెలిపారు. సీఎం జగన్‌ పేదల పక్షపాతి అని, ఇంగ్లీష్‌ మీడియం వల్ల పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇంగ్లీష్‌ మీడియంకు తాము వ్యతిరేకమని చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్‌ చదువుకు, మత మార్పిడికి సంబంధం ఏమిటని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు అవివేకంతో మాట్లాడుతున్నాయని ధ్వజమెత్తారు. రాజధానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను పక్కనపెట్టి, అప్పటి మంత్రి నారాయణ నివేదికను ఆమోదించిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు పాలసీలను ప్రజలు తిరస్కరించారు..వాటిని అమలు చేయాలని కోరటం టీడీపీ దివాళాకోరుతనం’ అని ధ్వజమెత్తారు. 2.60 లక్షల కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు పుణ్యమేనని విమర్శించారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెనకడుగు వేయలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement