
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట : మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సూర్యపేటలో పర్యటించిన ఆయన.. ప్రజల సొమ్ము దోచుకోవడంలో మంత్రి జగదీష్ రెడ్డి స్టూవర్టుపురం దొంగలను మించి పోయారని విమర్శించారు. నూతన కలెక్టరేట్ స్థలం ఎంపికలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సుమారు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. కలెక్టరేట్ విషయంలో దళితులను దారుణంగా మోసం చేశారని తక్కువ ధరకే బినామీలతో భూములు కొనిపించారని అన్నారు. ఏతప్పు చేయని రాజయ్యను బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి, మంత్రి జగదీష్ రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు స్పందించడంలేదంటూ ప్రశ్నించారు.
కలెక్టరేట్ కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని కోమటిరెడ్డి అన్నారు. భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన జగదీష్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదంటూ జోష్యం చెప్పారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ప్రజలందరికీ అందుబాటులోనే కలెక్టరేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో స్థలాలు కొనొద్దంటూ సూచించారు. ప్రజలను పట్టించుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫమైందని.. వారి అక్రమాలు, వైఫల్యాలను బయటపెడతామనే భయంతోనే తన శాసనసభ సభ్యత్వం రద్దు చేశారని కోమటి రెడ్డి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment