
సాక్షి, హుజూర్‌నగర్ : రైతులకు ప్రయోజనం చేకూరడం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఇష్టం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రజలు ఊహించిన పథకాలనే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అమలు పరుస్తున్నారని.. పథకాలు అమలు కాకముందే అవినీతి జరిగిదంటూ కాంగ్రెస్ నాయకులు అభియోగాలు మోపడం దురదృష్టకరమన్నారు.
సంక్షేమ పథకాల మీద అవగాహన లేకపోవడం వల్లే కాంగ్రెస్ నాయకులు నిందారోపణలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సన్నద్దమయ్యారని హెచ్చరించారు. రైతులకు పెట్టుబడి రూపంలో 4 వేల రూపాయలు అందిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. మే 10వ తేదీ నుంచి రైతులకు పెట్టుబడి చెక్కులు అందజేస్తామని ఆయన తెలిపారు.