నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(ఫైల్ ఫొటో)
మఠంపల్లి (హుజూర్‌నగర్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రొటోకాల్ నిబంధనల అమలులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు, సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానదిపై ఇటీవల ప్రారంభమైన వంతెనను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ 2013లో రూ.50 కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయించానని తెలిపారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం అప్రోచ్‌రోడ్డు పనులు మాత్రమే చేసి కనీస ఆహ్వానం కూడా లేకుండా తనను అవమానపరచిందన్నారు.
అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు కొన్ని హక్కులు, ప్రొటోకాల్ మర్యాదలు ఉంటాయని, కానీ ఉన్నతాధికారులు వాటిని పాటించకుండా కేవలం ఏఈ, డీఈ స్థాయి అధికారులతో నామమాత్రపు సమాచారమిచ్చి శిలాఫలకం కిందిభాగంలో పేరు పెట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్రిడ్జికి సంబంధించి పూర్తిస్థాయి నిధులను తానే మంజూరు చేయించి, పనులను కూడా పూర్తిచేయించానని వెల్లడించారు. అంతేగాకుండా ప్రధాన మంత్రి సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనలతోనే రాష్ట్రాలకు మంజూరవుతాయన్నారు. ఈ నిధులతో చేపట్టిన పథకాల ప్రారంభ కార్యక్రమాలకు ఎంపీలను పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను అవమానపరుస్తున్నారన్నారు. ఈ ఉల్లంఘనలు క్రోడీకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని, అలాగే హక్కుల కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. (చదవండి: ఖమ్మంలో బండి సంజయ్ వ్యాక్సిన్‌లు పనిచేయవు)
Comments
Please login to add a commentAdd a comment