టికెట్‌ వార్‌: ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌ | Huzurnagar Ticket War Between Revnath And Uttam Kumar | Sakshi
Sakshi News home page

టికెట్‌ వార్‌: ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌

Published Wed, Sep 18 2019 4:55 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Huzurnagar Ticket War Between Revnath And Uttam Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుస ఎన్నికల్లో ఘోర పరాజయంలో ఉన్న టీకాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు పార్టీని పతనావస్థకు చేరుస్తున్నాయి. నేతలు, కార్యకర్తల మధ్య అవగహనలేమితో గత అసెం​బ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న హస్తం పార్టీ.. ఫలితాల అనంతరం కూడా పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించట్లేదు. ఈ కారణం చేతనే ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. అయితే తాజాగా హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక ఆ పార్టీకి కఠిన పరీక్షగా మారింది. గత ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి.. ఆ తరువాత ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికకు తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతిని బరిలో నిలుపుతున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. దీంతో రేవంత్‌రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

తమను సంప్రదించకుండానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ఊగిపోతోంది. ఈ విషయాన్ని స్థానిక నేతలు రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. టికెట్ తమకు దక్కెవిధంగా చూడాలని ఆయన్ని అభ్యర్థించారు. దీంతో రంగంలోకి దిగిన రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టికెట్‌ను శ్యామల కిరణ్‌రెడ్డికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఉత్తమ్‌- రేవంత్‌ వర్గాల మధ్య టికెట్‌ వార్‌ మొదలైంది. కాగా పద్మవతిని గెలిపించుకునేందుకు ఉత్తమ్‌ ఇదివరకే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్థానిక నేతలను కలుస్తూ.. మద్దతును కూడగట్టుకుంటున్నారు. మరోవైపు రేవంత్‌ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో పదవులు ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఊహించలేం అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాను ఎవరితోనైనా కలుస్తాన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement