
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పరిష్కారానికి టీపీసీసీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్. సంపత్‌కుమార్, ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ నియోజకవర్గంలో పార్టీ పరంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కారానికి సూచనలు చేస్తూ టీపీసీసీకి నివేదిక అందించనుంది.
తుంగతుర్తిలో రెండుగా చీలిన కాంగ్రెస్
ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలి ఒకవర్గంపై మరొకవర్గం ఆరోపణలు చేసుకోవడం తారస్థాయికి వెళ్లింది. గత ఎన్నికల్లో నియోజకర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన అద్దంకి దయాకర్ ఇటీవల మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి(ఆర్డీఆర్)పై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. తనను, తన వర్గాన్ని నియోజకవర్గంలో ఆర్డీఆర్ తిరగనివ్వడంలేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను దామోదర్‌రెడ్డి దూషించాడని హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్‌లో కూడా అద్దంకితో పాటు ఆయన వర్గం ఫిర్యాదు చేసింది. దీనిపై ఆర్డీఆర్ వర్గం కూడా అగ్గివీుద గుగ్గిలమైంది. అద్దంకి దయాకర్‌పై నియోజకవర్గ వ్యాప్తంగా బాహాటంగా విమర్శలు గుప్పించింది. అలాగే అద్దంకిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో సయోధ్య కుదుర్చేందుకు టీపీసీపీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోనైనా రెండు వర్గాల మధ్య రాజీకుదురుతుందోలేదో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment