సాక్షి, విజయవాడ: విజయవాడలోని 29వ డివిజన్‌లో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రావాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని), వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు రూ. కోటి 60 లక్షలతో అక్కడ చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణా పనులకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక రూ. 2 కోట్లతో 29వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో 29వ డివిజన్ వివక్షకు గురైందని మంత్రి పేర్కొన్నారు. రూ. కోటి అరవై లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు పాలనలో విజయవాడ అభివృద్ధిలో ఆఖరి భాగంగా ఉందని అన్నారు. విజయవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని , ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హమీ ఇచ్చారు.
అదే విధంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనకు వెనుకబడిన ఈ డివిజనే ఉదాహరణ అని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కుమారుడు ఇసుక కోసం దీక్ష చేయడం హస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. ఐదేళ్లు వారి ఇంటి వెనకాల ఇసుక దోపిడి జరిగితే మూటలు ఇంటికి చేరాయని అప్పుడు మాటలు రాలేదని ఆయన అన్నారు. ఐదేళ్ల వారి తండ్రి పాలన పుణ్యమా అని వర్షాలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. వరదలు రైతాంగానికే అదృష్టమైతే భవన నిర్మాణ కార్మికులకు సమస్యలుగా మారాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే వరదలను కూడా రాజకీయాలకు వాడుకునే దుర్బుద్ధి తండ్రీకొడుకులదని మంత్రి విమర్శించారు.
ఇక మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాగానే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని, రైతాంగమంతా సుభిక్షంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులంతా బాధ పడుతుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం దాని నుంచి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ ఐదు గంటల దీక్ష కామిడి స్కిట్‌లా ఉందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై తండ్రీకొడుకులు బురద చల్లాలని చుస్తున్నారని, ఐదేళ్ళలో.. ఇసుక, మట్టి తవ్వకాలను అవినీతికి అడ్డాగా వారిద్దరూ మార్చేశారని అన్నారు.
ఎమ్మెల్యే మాల్లాది విష్టు మాట్లాడుతూ.. ఇసుక కొరత ప్రభుత్వం తప్పు, మానవ తప్పిదం అంటూ చంద్రబాబు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడిపై గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన జరిమానానే ఇందుకు ఉదాహరణ అన్నారు. వారోత్సవాల పేరుతో ఇసుక ఇబ్బందిని తీర్చేందుకు సీఎం జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు విజయవాడలో సమీక్షల పేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెడి ఆర్టిస్తులా ప్రవర్తిస్తున్నారని విష్ణు ఎద్దేవా చేశారు.(చదవండి: ఇసుక వారోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment