
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరిగాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీ సంక్షేమానికి చెందిన రూ. 1,432 కోట్లను ఇతర శాఖలకు మళ్లించారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లకు రెండేళ్లుగా అద్దె చెల్లించలేదని తెలిపారు.
మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్‌ల ద్వారా రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. బ్యాంకులతో రుణాల ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఆదరణ పథకంతో పాటు ఇతర అక్రమాలపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు.