సుధీర్‌రెడ్డి , మల్లారెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పరిషత్ ఎన్నిక అధికార పార్టీలో అగ్గి రాజేసింది. ఇదికాస్త మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నువ్వా..నేనా అనే స్థాయికి చేరింది. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సుధీర్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, ఘట్కేసర్ ఎంపీపీగా ఇటీవల ఎన్నికైన సుదర్శన్‌రెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో పార్టీ అభ్యర్థి ఓటమి నుంచి ఇద్దరు నాయకుల మధ్య మొదలైన ప్రత్యక్ష యుద్ధం మండల పరిషత్ ఎన్నికల వివాదంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్ష పదవికి తాను సూచించిన వ్యక్తిని కాదని, ఇతర పార్టీల ఎంపీటీసీలతో కలిసి మంత్రి మల్లారెడ్డి తన వర్గీయుడైన సుదర్శన్‌రెడ్డికి పదవీ కట్టబెట్టడాన్ని సు«ధీర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు. తన సొంత మండలంలో పార్టీని నిలువునా చీల్చే ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆరోపిస్తూ మంత్రిని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పూర్తి పట్టు కోసం మంత్రి ఓవైపు... తన ఆధిపత్యం చేజారకూడదన్న లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే మరోవైపు ఎవరికి వారుగా ఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
ఉప్పు.. నిప్పు
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి పోటీ చేసిన విషయం విదితమే. అయితే సుధీర్‌రెడ్డి వర్గం పని చేయకపోవడంతోనే నియోజకవర్గంలో మెజారిటీ పూర్తిగా తగ్గిపోయిందని మంత్రి అనుచరులు ఆరోపిస్తుండగా... మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా తన కుమారుడు శరత్‌ను అడ్డుకునేందుకే మంత్రి తన బంధువు శ్రీనివాసరెడ్డిని మూడు చింతలపల్లిలో పోటీ చేయించారని సుధీర్‌రెడ్డి వర్గం పేర్కొంటోంది. అంతే కాకుండా మంత్రి ప్రోత్బలంతోనే తన సొంత మండలమైన ఘట్కేసర్‌లో తనను కాదని, తన వ్యతిరేకి సుదర్శన్‌రెడ్డిని ఇతర పార్టీలతో కలిసి ఎంపీపీ చేశాడని సుధీర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆపై తనను రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, తాను ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని సుధీర్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment