మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, హాజరైన పార్టీ కార్యకర్తలు, బూతు కమిటీ కన్వీనర్లు, సభ్యులు
కల్లూరు: వైఎస్సార్‌సీపీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అర్బన్ పరిధిలోని శ్రీసాయిశ్రీనివాస గార్డెన్‌లో కల్లూరు 14వ వార్డుల్లోని బూతు కమిటీ సభ్యుల సమావేశం అర్బన్ ఇన్‌చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయేది ఎన్నికల కాలమని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే ‘నవరత్నాలు’ పథకాలను అమలు చేసేందుకు జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
నవరత్నాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించాలన్నారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని బూతు కమిటీలను బలోపేతం చేద్దామని, కమిటీ సభ్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉంటే వారి స్థానాలను త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో నగర శివారులోని వీజేఆర్ ఫంక్షన్ హాలులో పార్టీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని, పాణ్యం నియోజకవర్గానికి కేటాయించిన తేదీన జరిగే శిక్షణ తరగతులకు ప్రతి కార్యకర్త హాజరుకావాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోసారి గౌరు చరితారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరా రు. జిల్లా నాయకులు తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కమిటీలు ప్రజల రక్త మాంసాలను పీక్కు తింటున్నాయని, కమిటీ సభ్యులు తోడేళ్ల గుంపుగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఫిరోజ్, 14 వార్డుల ఇన్‌చార్జ్‌లు, బూతు కన్వీనర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment