సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో సిద్ధాంతాలు లేని వ్యక్తి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ నిప్పులు చెరిగారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యక్తిత్వం, నిబద్ధత అనే పదాలకు పవన్ డిక్షనరీలో చోటు లేదని దుయ్యబట్టారు. పవన్‌ను పొలిటికల్ ఫ్రీలాన్సర్‌గా అభివర్ణించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా లేదా, ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచిన తర్వాత.. సార్వత్రిక ఎన్నికలు గురించి మాట్లాడితే బాగుంటుందని పవన్‌కు చురకలు అంటించారు.
పాచిపోయిన లడ్డూ ఇచ్చినవారితో పొత్తా..
ప్రత్యేకహోదాపై బీజేపీ నుంచి ఎటువంటి హామీ లభించిందో ఆయన ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూ ఇచ్చారని బీజేపీని విమర్శించిన పవన్.. ఇప్పుడు అదే పార్టీతో ఎలా పొత్తుకు సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. అధికారం కోసం పవన్ తహతహ లాడుతున్నారని.. ఆయనకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఇస్తారనే సమాచారం ఉందని పేర్కొన్నారు. ఆయనకు మూడు బాగా కలిసి వచ్చిందని..అందుకే తృతీయ ప్రత్యామ్నాయం అంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కెమెరా ముందు కన్నా ప్రజల ముందు బాగా నటిస్తున్నారని విమర్శించారు.
ఎందుకు విమర్శలు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలను అమర్‌నాథ్ తప్పుబట్టారు. ‘గత ఆరునెలలుగా ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకా.. అవినీతి మరక లేకుండా పరిపాలిస్తున్నందుకా.. ఇచ్చిన హామీలు 80 శాతం నెరవేర్చినందుకా’ అంటూ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment