మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు (వైఎస్సార్ కడప): సీఎం చంద్రబాబు నాయుడు మరో మారు ముస్లిం మైనారిటీలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గుంటూరులో నారా హమారా – టీడీపీ హమారా కార్యక్రమాన్ని నిర్వహించి మైనారిటీల ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 2004 ఎన్నికల కంటే ముందు ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం చంద్రబాబు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముస్లింల ఆర్థిక అభివృద్ధి కోసం ఇస్లామిక్ బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారని తెలిపారు. రూ.2,500 కోట్లతో ముస్లిం మైనారిటీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానని చెప్పారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మైనారిటీలకు 15 అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పారన్నారు. వాటిని నెరవేర్చలేదని విమర్శించారు.
చరిత్రలో మంత్రి పదవి ఇవ్వని క్యాబినెట్ లేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి క్యాబినెట్‌లో ముస్లిం మైనారిటీలకు చెందిన వారికి మంత్రి పదవి ఇచ్చే ఆనవాయితీ కొనసాగిందని తెలిపారు. దేశమంతా ఈ ఆనవాయితీ పాటిస్తున్నారని చంద్రబాబు మాత్రం తిరస్కరించారన్నారు. చరిత్రలో వారికి మంత్రి పదవి ఇవ్వని ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు దొడ్డిదారిన (ఎమ్మెల్సీగా ఎన్నుకుని) మంత్రి పదవి ఇచ్చారన్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టిన నారాయణకు, యనమల రామకృష్ణుడుకు మంత్రి పదవులు ఇచ్చారని తెలిపా రు. ఈ తరహాలో ముస్లిం సోదరులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యాభివృద్ధి కోసం 1200 ఉర్దూ టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని చెప్పి ఉన్న పోస్టులను కూడా తొలగించారన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో హజ్ యాత్ర కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంతోపాటు హజ్‌హౌస్‌లను నిర్మిస్తామని చెప్పి నిర్మించలేదన్నారు.
నిధులు పక్కదారి
దామాషా ప్రకారం బడ్జెట్‌లో కేటాయిం పులు చేస్తానని చెప్పి నిధులను పక్కదారి మళ్లించారని విమర్శించారు. 2015–16లో బడ్జెట్‌లో ముస్లిం మైనారిటీలకు రూ.724 కోట్లు కేటాయించి రూ.217, 2016–17లో రూ.827 కోట్లకు రూ.248, 2017–18లో రూ.1102 కోట్లకు రూ. 280 కోట్లు ఈ ప్రకారం మొత్తం మూడేళ్లలో రూ.2,653 కోట్లకు గాను రూ.745 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం వడ్డీ లేకుండా రూ.5 లక్షలు రుణాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నా రు. ఈ విషయంలో తాను ఏ ఛాలెంజ్ చేయడానికైనా సిద్ధమేనన్నారు. పేద, మధ్య తరగతి వారు వ్యాపారాభివృద్ధి కోసం బ్యాంకులతో నిమిత్తం లేకుండా రూ.లక్ష వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్లంబింగ్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పి శిక్షణతోపాటు వారికి పనిముట్లు కూడా ఇవ్వలేదన్నారు.
టీడీపీ విప్ మాటలు వెనక్కి తీసుకోవాలి
ముస్లిం మైనారిటీ డ్వాక్రా మహిళలకు రూ.5 వేలు ఇస్తామని చెప్పారన్నారు. ముస్లిం పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించా రన్నారు. వారి విద్యాభివృద్ధి కోసం ఇంగ్లిషు మీడియం పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామని, మదరసాలలో చదివే వారికి బస్ పాస్ ఇవ్వడంతోపాటు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని తెలిపారన్నారు. ముస్లింలు పవిత్రంగా భావించి కబరస్థాన్‌లకు స్థలాలను కేటాయిస్తామని చెప్పారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం సీట్లు కేటాయిస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. పరిస్థితి ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ విప్ షరీఫ్ ఇటీవల మాట్లాడుతూ చంద్రబాబును అల్లాతో సమానంగా భావించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నా రు. ఇప్పటికైనా షరీఫ్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని కోరారు. పవిత్రమైన ఖురాన్‌కు సంబంధించిన అల్లాకు ఎవరూ ప్రతిరూపం కాదన్నారు. ముస్లింల కష్టాలకు కారకుడైన చంద్రబాబు సైతాన్‌తో సమానమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment