సీఎం నారాయణస్వామి , ధనవేల్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ఎమ్మెల్యే తిరుగుబావుటా ఎగర వేశారు. సీఎం నారాయణస్వామితో పాటు, మంత్రుల అవినీతి చిట్టా తన వద్ద ఉందని ఆ ఎమ్మెల్యే ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లోపుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి మారారు. ఇక్కడ సాగుతున్న అధికార సమరంతో అభివృద్ధి అన్నది కుంటు పడింది. ప్రజాహిత కార్యక్రమాలు అడుగైనా ముందుకు సాగడం లేదన్న విమర్శలు, ఆరోపణలు ఎక్కువే. నారాయణస్వామి సర్కారును ఇరకాటంలో పెట్టడం లేదా, ఆ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా బీజేపీ వర్గాలు సైతం వ్యూహాలకు పదును పెడుతూనే వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగు బావుటా ఎగురవేయడమే కాదు, అవినీతి చిట్టా తన వద్ద ఉందని ప్రకటించడం పుదుచ్చేరి కాంగ్రెస్ పాలకుల్లో కలవరం బయలుదేరింది.
అవినీతి చిట్టా.....
పుదుచ్చేరిలో కాంగ్రెస్ పాలన అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉందని ప్రతిపక్షం ఎన్‌ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేతో పాటు బీజేపీకి చెందిన ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీలో పాలకుల్ని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు గుప్పించడం చర్చకు దారి తీసింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బహుర్ ఎమ్మెల్యే ధనవేల్ తమ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనపై క్రమశిక్షణ చర్యకు సీఎం నారాయణస్వామి సమాయత్తం అవుతున్నారు. ఈ సమాచారంతో ధనవేల్ మరిత దూకుడు పెంచారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నారాయణస్వామితో పాటు మంత్రుల అవినీతిపై తీవ్ర ఆరోపణలు గుప్పించడం గమనార్హం.
తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే ఆనందమేనని వ్యాఖ్యానించారు. వారు లేఖ రూపంలో ఫిర్యాదు చేస్తే, తాను సీఎంతో పాటు మంత్రుల అవినీతి జాబితాతో తమ నేత సోనియాగాంధీని కలుస్తానని ప్రకటించారు. సీఎంగా నారాయణస్వామి మరికొన్నాళ్లు కొనసాగిన పక్షంలో పుదుచ్చేరిలో కాంగ్రెస్ అడ్రస్సు గల్లంతైనట్టేనని ఆందోళన వ్యక్తం చేశా>రు. ఆ మేరకు అవినీతి రాజ్యమేళుతున్నట్టు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కాస్త ప్రతి పక్షాలకు అస్త్రంగా మారాయి. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేతిలోనే అవినీతి చిట్టా ఉందంటే, ఏ మేరకు ఈ పాలకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారో అన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని పుదుచ్చేరి పాలకులపైచర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment