సాక్షి, చెన్నై: తిరువొత్తియూరు డీఎంకే ఎమ్మెల్యే కేపీ శంకర్ చిక్కుల్లో పడ్డారు. కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్‌ను ఆయన చెంప మీద కొట్టినట్టుగా వచ్చిన ఫిర్యాదుతో పార్టీ పదవి నుంచి డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తొలగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని పోలీసుల్ని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్‌సింగ్ బేడీ కోరారు. వివరాలు.. తిరువొత్తియూరు నటరాజన్ వీధిలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల సమయంలో శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కేపీ శంకర్ విధుల్లో ఉన్న సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ సమయంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ ఇంజినీరు చెంప మీద కొట్టినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం తీవ్రంగా పరిగణించింది. అసలు ఎమ్మెల్యే చెంప మీద కొట్టాల్సింత పరిస్థితి ఎందుకు వచ్చిందో అని ఆరా తీశారు. రోడ్డు పనుల గురించి తనకు సమాచారం ఇవ్వలేదనే ఆగ్రహంతోనే వీరంగాన్ని ప్రదర్శించినట్టు వెలుగు చూసింది. దీంతో కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సమాచారం కాస్త ప్రభుత్వ వర్గాల దృష్టికి చేరింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ శనివారం ఓ ప్రకటన చేశారు. కేపీ శంకర్ చేతిలో ఉన్న తిరువొత్తియూరు పశ్చిమ జిల్లా పార్టీ కార్యదర్శి పదవిని తప్పించారు. దీంతో ఎమ్మెల్యేకు చిక్కులు తప్పలేదు. అదే సమయంలో చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్‌కు కార్పొరేషన్ కమిషనర్ గగన్ దీప్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఇందుకు తగిన లేఖను ఆయనకు పంపించడంతో తిరువొత్తియూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment