![AIADMK Former MLA Paramasivam Convicted In Assets Case - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/30/tamil-nadu.jpg.webp?itok=x-rEZfiB)
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పరమశివంకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 33 లక్షలు జరిమానా విధిస్తూ సోమవారం విల్లుపురం కోర్టు తీర్పు ఇచ్చింది. విల్లుపురం జిల్లా చిన్న సేలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1991లో అన్నాడీఎంకే అభ్యర్థిగా పరమశివం అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 1991–96 కాలంలో అన్నాడీఎంకే పాలనలో అవినీతి విలయతాండవం చేసినట్టుగా ఆతర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే కొరడా ఝుళిపించే పనిలో పడింది. ఈ అక్రమాస్తుల కేసులు దివంగత సీఎం జయలలిత, చిన్నమ్మ అండ్ కంపెనీతో పాటు పలువురు నేతలపై కూడా వేర్వేరుగా కేసులు దాఖలయ్యాయి. ఇందులో పరమశివం కూడా ఉన్నారు. 1991–96 సంవత్సరంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు అక్రమంగా గడించినట్టుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రధానంగా తన ఇద్దరు కుమారులు, భార్య పేరిట ఈ అక్రమాస్తులను ఆయన గడించినట్టు విచారణలో తేలింది.
జైలుశిక్ష..
1998లో ఏసీబీ నమోదు చేసిన ఈ కేసు తొలుత విల్లుపురం కోర్టులో సాగింది. ఆతర్వాత చెన్నైలోని ప్రజాప్రతినిధుల కేసుల ప్రత్యేక కోర్టుకు మారింది. కొంతకాలం ఇక్కడ విచారణ సాగినా, మళ్లీ విల్లుపురం జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. త్వరితగతిన విచారణ ముగించాలని విల్లుపురం జిల్లా కోర్టును ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఆ మేరకు న్యాయమూర్తి ఇలవలగన్ కేసు విచారణను ముగించారు. ఐదేళ్ల కాలంలో ఆదాయానికి మించి అక్రమాస్తులను పరమశివం గడించినట్టు పోలీసుల విచారణలో తేలి నట్టు ప్రకటించారు. ఈ అక్రమాస్తులన్నీ ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకోవాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే పరమశివంకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.33 లక్షలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో, అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి సోమవారం సాయంత్రం తీర్పు వెలువరించారు. రెండు దశాబ్దాల అనంతరం ఈ కేసు తీర్పు వెలువడడం గమనార్హం.
చదవండి: కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం
Comments
Please login to add a commentAdd a comment