చెన్నై: తమిళనాడు ప్రజలకు భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తమిళులు అనుసరించే వైఖరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకే చాలా ఘటనలు మనం చూసే ఉంటాం. ఈ తరహాలోనే తాజాగా మరో వివాదం రాజుకునేలా కనిపిస్తోంది. భారత్‌లో ఐపీఎల్ టోర్నీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎన్ని వివాదాలు ఈ టోర్నిని చుట్టు ముట్టిన వాటన్నింటిని ఎదుర్కుంటూ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ప్రత్యేకంగా భారత మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అలాంటి సీఎస్‌కే జట్టును నిషేధించాలని తమిళనాడు ఆసెంబ్లీలో డిమాండ్ మొదలైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీంని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో రగడ మొదలైంది. పీఎంకే ఎమ్మెల్యే ఎస్పీ వెంకటేశ్వరన్ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లెవరూ లేరని, కానీ తమను తాము తమిళనాడు టీమ్‌గా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.
ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ సీఎస్‌కే జట్టు రాష్ట్రం నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయలేదని, తమిళనాడు జట్టు అంటూ ప్రచారం చేస్తూ లాభాలు మాత్రం గడిస్తున్నారని అన్నారు. అందుకే తమిళులు లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించాలని శాసనసభలో పట్టుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment