ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్ల మధ్య సరదా ఫైట్ జరిగింది. జట్టులో స్థానం కోసం ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, దీపక్ చాహర్ మాటల యుద్దానికి దిగారు. తన ఆల్‌టైమ్ బెస్ట్ సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం కల్పించకపోవడంతో చాహర్.. దూబేకు ఓ ఛాలెంజ్ విసిరాడు.
వచ్చే ఏడాది నువ్వు (దూబే), నేను (చాహర్) ఓ సింగిల్ ఓవర్ మ్యాచ్ ఆడదాం. నేను నీకొక ఓవర్ బౌల్ చేస్తాను. నువ్వు నాకు ఒక ఓవర్ బౌల్ చెయ్యి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారిదే సీఎస్‌కే ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్పాట్ అని చాహర్.. దూబేను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. చాహర్ సరదాగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతుంది.
ఛాంపియన్ జట్టులో స్థానం కోసం ఈ మాత్రం పోటీ ఉండాల్సిందే అని అభిమానులు అంటున్నారు. కాగా, దూబే తన ఆల్‌టైమ్ బెస్ట్ సీఎస్‌కే జట్టులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా తనతో పాటు అల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రేవోలను ఎంపిక చేసి, ఇదే కేటగిరీకి చెందిన దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించలేదు.
ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 ఎడిషన్‌లో శివమ్ దూబే సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌ల్లో 159.92 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ధసెంచరీల సాయంతో 411 పరుగులు చేశాడు. దూబే ఈ సీజన్‌లో ఏకంగా 35 సిక్సర్లు బాది ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. మరోవైపు ఇదే సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన దీపక్ చాహర్ బంతితో ఓ మోస్తరుగా రాణించి 13 వికెట్లు పడగొట్టాడు. ఓ రకంగా చూస్తే వీరిద్దరూ తమతమ స్థానాలకు న్యాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment