కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా- సీఎస్‌కే సారథి ధోని (PC: IPL)
IPL 2023 CSK vs KKR- MS Dhoni Comments: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు తమ ఆటగాళ్లు శాయశక్తులా ప్రయత్నించారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి తమ బ్యాటర్లు లేదంటే బౌలర్లను నిందించాలనుకోవడం సరికాదని.. పిచ్ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 లీగ్ దశలో సీఎస్‌కే సొంతగడ్డపై ఆదివారం ఆఖరి మ్యాచ్ ఆడేసింది.
దూబే హిట్టింగ్
చెపాక్ వేదికగా కేకేఆర్‌తో తలపడిన చెన్నై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 30 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో వచ్చిన శివం దూబే 34 బంతుల్లో 48 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(20) తప్ప ఎవరూ కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు.
అదరగొట్టిన దీపక్ చహర్.. కానీ
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు దీపక్ చహర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(1), జేసన్ రాయ్(12)లను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపాడు.
రాణా, రింకూ హాఫ్ సెంచరీలతో
వన్‌డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(9)ను త్వరగా అవుట్ చేశాడు. ఈ క్రమంలో నితీశ్ రాణా కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 57 పరుగులు, నాటౌట్)తో ఆకట్టుకోగా.. రింకూ సింగ్ 43 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. వీరిద్దరి అర్ధ శతకాలతో కేకేఆర్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ధోని సేనపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరచుకుంది.
ఇక ఓటమితో సీఎస్‌కే ఖాతాలో ఐదో పరాజయం నమోదైంది. అయినప్పటికీ ఇప్పటికే 13 మ్యాచ్‌లకు గాను ఏడు గెలిచిన చెన్నై 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు దాదాపు అర్హత సాధించినట్లే!
అదే తీవ్ర ప్రభావం చూపింది
ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఓటమి అనంతరం ధోని మాట్లాడుతూ.. గెలిచేందుకు తమ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డారని, పరాజయానికి వారిని తప్పుపట్టాలనుకోవడం లేదన్నాడు. ‘‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నపుడు సెకండ్ ఇన్నింగ్స్ నుంచి బంతి మంచిగా టర్న్ అయినపుడు.. ఇది 180 పరుగుల వికెట్ అని తెలిసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మేమైతే ఈ స్కోరు దరిదాపులకు కూడా వెళ్లలేకపోయాం. డ్యూ(తేమ) ప్రభావం చూపింది. తొలి, రెండో ఇన్నింగ్స్‌కు తేడా మీరు కూడా చూసే ఉంటారు. మొదటి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్.. రెండో ఇన్నింగ్స్‌లో పేసర్లకు అనుకూలంగా మారింది. మా ఓటమికి పరిస్థితుల ప్రభావమే కారణం’’ అని ధోని చెప్పుకొచ్చాడు.
దూబే అద్భుతం.. చహర్ విలువైన ఆస్తి
ఇక శివం దూబే అద్బుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించిన ధోని.. అతడు ఇలాగే నిలకడైన ఆట తీరు కొనసాగించాలని ఆకాంక్షించాడు. అదే విధంగా ఫాస్ట్‌బౌలర్ దీపక్ చహర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. ఎలా బౌల్ చేయాలి.. ఫీల్డింగ్ ఎలా సెట్ చేసుకోవాలన్న అంశాలపై అతడికి పూర్తి అవగాహన ఉంటుంది.
నిజంగా జట్టుకు తనొక విలువైన ఆస్తి. తను ఇప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్‌గా కనిపిస్తున్నాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడు’’ అని ధోని.. చహర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు ఇచ్చిన చహర్.. మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుతంగా బ్యాటింగ్ చేసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2023: మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి
'అరె లొల్లి సల్లగుండ'.. ప్రశ్న అర్థంగాక ధోని ఇబ్బంది
𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛
— IndianPremierLeague (@IPL) May 14, 2023
A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg
Comments
Please login to add a commentAdd a comment