IPL 2023, CSK VS KKR: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..! | My Best Is Yet To Come: Ajinkya Rahane - Sakshi
Sakshi News home page

CSK VS KKR: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా: రహానే

Published Mon, Apr 24 2023 7:28 AM | Last Updated on Mon, Apr 24 2023 8:44 AM

CSK VS KKR: Rahane Feels That Best Is Yet To Come - Sakshi

photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 23) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 49 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్లు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒకరితో ఒకరు పోటీపడి మరీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. వెటరన్‌ ఆటగాడు, టెస్ట్‌ క్రికెటర్‌గా ముద్రపడ్డ అజింక్య రహానే ఇన్నింగ్స్‌ (29 బంతుల్లో 71 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అయితే వేరే లెవెల్లో ఉంది. టీ20లకు అస్సలు పనికిరాడు అనుకున్న రహానేలో ఇంత ఉందా అని జనాలు అనుకునేలా చేశాడు.

అగ్నికి ఆయువు తోడైనట్లు రహానేకు యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరు ఇన్నింగ్స్‌ చివర్లో ఉగ్రరూపం దాల్చారు. ఆఖర్లో జడేజా (8 బంతుల్లో 18; 2 సిక్సర్లు)  సైతం నేనేమైనా తక్కువా అన్న చందంగా 2 సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు. అంతకుముందు ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎప్పటిలాగే తమ స్థాయిలో ఇరగదీశారు.

మొత్తంగా చెన్నై బ్యాటర్ల సిక్సర్ల సునామీతో, బౌండరీల ప్రవాహంతో మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్‌ గార్డెన్స్‌ తడిసి ముద్దైంది. ధోని సేన నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డైంది. ఛేదనలో కేకేఆర్‌ ఓ మోస్తరుగా పోరాడినప్పటికీ గెలుపుకు ఆమడు దూరంలోనే నిలిచిపోయింది. జేసన్‌ రాయ్‌ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్‌ (33 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) జూలు విదిల్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 

ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం దాల్చిన ఆజింక్య రహానేకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా రచ్చ రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్‌లో దూకుడు పెరగడంపై స్పందిస్తూ.. ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా.. అన్న రేంజ్‌లో కామెంట్స్‌ చేశాడు. ధోని భాయ్‌ నేతృత్వంలోనే నేను రాటుదేలానని, అతను చెప్పింది చేస్తే ఆటోమాటిక్‌గా మనలో ఆటకు తగ్గ మార్పులు వస్తాయని అన్నాడు.

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని నాక్స్‌కు ఎంజాయ్‌ చేశానని, మున్ముందు ఇంకొంత దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. కాగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రహానే తన ఆటతీరుకు భిన్నంగా వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో మెరుపులు మెరిపించాడు. ఆ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న అతను.. 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఒంతిచేత్తో తన జట్టును గెలిపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement