India Star Opener Wife On MS Dhoni's 'Aura': మహేంద్ర సింగ్ ధోని అంటేనే ఓ ఎమోషన్. కెప్టెన్ కూల్ పక్కన ఉన్నాడంటే ఆటగాళ్లకు పండుగే! ఆటకు సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్లను నవ్వించడం, వాళ్లలో సానుకూల దృక్పథం నింపేలా నడచుకోవడం తలా స్టైల్! టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ భార్య, క్రికెటర్ ఉత్కర్ష పవార్ కూడా ఇదే మాట అంటోంది.
నాలుగేళ్లుగా సీఎస్‌కేకే
మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధోని సారథ్యంలో గత నాలుగేళ్లుగా సీఎస్‌కేకు ఆడుతున్న అతడు 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ముగిసిన తర్వాత రుతు.. తన చిరకాల ప్రేయసి ఉత్కర్షను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
భయ్యా అని పిలవలేం
అయితే, అంతకంటే ముందే ఆమెను తనతో పాటు సీఎస్‌కే క్యాంపునకు తీసుకెళ్లాడు రుతురాజ్. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్ ధోనిని కలిసిన ఉత్కర్ష.. జట్టు చాంపియన్‌గా అవతరించిన తరుణంలో అతడితో కలిసి ఫొటోలు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన ఉత్కర్ష.. ధోని వ్యక్తిత్వం, నిరాడంబరత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘‘ఎంఎస్ ధోని తన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చేస్తారు. ఆయనను మనం భయ్యా అని పిలవలేము. ఆయనతో మాట్లాడిన తర్వాతే కచ్చితంగా ‘సర్’ అని పిలవడమే సరైందని భావిస్తాం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనకే చెల్లింది.
కుటుంబ సభ్యుల్లా చూస్తారు
అసలు మనం ధోనితోనే ఉన్నామా అనే ఫీలింగ్ కలిగేలా చేస్తారు. తన హాస్యచతురతతో చుట్టూ ఉన్న వాళ్లను నవ్విస్తారు. అందరూ కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేస్తారు. ఆరంభంలో అడపాదడపా ఆయనను నేరుగా కలిసే అవకాశం వచ్చింది. అయితే, ఫైనల్ తర్వాత ఎక్కువ సమయం కలిసి గడిపే అవకాశం దొరికింది.
ఆయన ప్రతి ఒక్కరిని తన సొంత కుటుంబ సభ్యుల్లాగే ప్రేమగా చూస్తారు. నేను, రుతు.. రెండు నెలల పాటు సీఎస్‌కేతో కలిసి ఉన్న రోజులు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగించాయి’’ అని ఉత్కర్ష చెప్పుకొచ్చింది. కాగా దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న 24 ఏళ్ల ఉత్కర్ష పేస్ ఆల్‌రౌండర్. ఇక ఐపీఎల్-2023 విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
చదవండి: WC: సిరాజ్ కూడా ఉండకపోవచ్చు! వాళ్లకు జట్టులో చోటు దక్కినా కూడా..
టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం..
Comments
Please login to add a commentAdd a comment