చెన్నై సూపర్‌కింగ్స్ ( Photo Credit: CSK Twitter/IPL)
IPL 2023- CSK- Ruturaj Gaikwad: ‘‘అతడు కేవలం ఫిఫ్టీలు కొట్టడమే కాదు.. వాటిని సెంచరీలుగా మలచడంలోనూ సఫలమయ్యే సత్తా కలిగిన వాడు. అందుకే మిగతా వారితో పోలిస్తే మరింత ప్రత్యేకంగా కనిపిస్తాడు. గత రెండు సీజన్లలో సీఎస్‌కే తరఫున పరుగుల వరద పారించాడు. శతకం కూడా బాదాడు.
కానీ ఎందుకో టీమిండియాలో అతడి పెద్దగా అవకాశాలు లభించలేదు. జట్టులో సుస్థిరమైన చోటు కోసం ఇంకా ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ ఈ సీజన్‌లో బాగా ఆడితే అయినా మరోసారి భారత జట్టులో తన పేరు చూస్తామేమో!’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
ధోనికి సరైన వారసుడు
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిన వీరూ భాయ్.. అతడికి టీమిండియాలో మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. సీఎస్‌కే సారథిగా మహేంద్ర సింగ్ ధోనికి అతడే సరైన వారసుడు అనిపిస్తున్నాడంటూ.. రుతు నైపుణ్యాలను కొనియాడాడు.
కాగా 2021 ఐపీఎల్ సీజన్లో రుతురాజ్ చెన్నై తరఫున 16 ఇన్నింగ్స్‌లో 635 పరుగులు సాధించాడు. ఆ సీజన్‌లో రుతు అత్యధిక స్కోరు 101 నాటౌట్. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా! 2022లో మాత్రం 14 ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసిన ఈ ముంబై కెప్టెన్.. తాజా సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు.
అదిరే ఆరంభం
గుజరాత్ టైటాన్స్‌తో ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్‌లో 92 పరుగులతో చెలరేగాడు. ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ముందంజలో ఉన్నాడు. ఇక ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో దంచికొట్టే రుతురాజ్ 2021లో శ్రీలంకతో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది సౌతాఫ్రికాతో స్వదేశంలో సిరీస్ సందర్భంగా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.
ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!
దేశవాళీ క్రికెట్‌లో ముంబై సారథిగా వ్యవహరిస్తున్న ఈ యువ ఓపెనర్.. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 9 టీ20లు(135 పరుగులు), ఒక వన్డే(19 పరుగులు) మాత్రమే ఆడాడు. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌ల రూపంలో పోటీ ఎదుర్కొంటున్న 26 ఏళ్ల రుతుకు టీమిండియాలో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఒకవేళ జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో స్థానం సంపాదించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక..
మార్కరమ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. సౌతాఫ్రికాకు ప్రపంచకప్ బెర్తు ఖరారు! ఒక్కడివే 175 కొట్టావు.. కానీ ఇక్కడ అంతా కలిసి..
Comments
Please login to add a commentAdd a comment