
సాక్షి, చిత్తూరు : రాజధాని అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు వైఖరిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎండగట్టారు. ఆయనకు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చిత్తశుద్ధి ఉంటే.. ఐదేళ్ల పాలనలో అన్నీ
తాత్కాలిక నిర్మాణాలే ఎందుకు కట్టారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి అప్పుడే జోలె పట్టి, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తేవాల్సిందని అన్నారు. నగరిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆమె
మీడియాతో మాట్లాడారు. పండగల్ని కూడా బాబు రాయకీయం చేస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారు. అవన్నీ ఎవరు తిన్నారు. నువ్వా.. లోకేశా..? రాజధానిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ రాజధానిని మారుస్తామని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు ఏర్పాడతాయని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచనల్ని ప్రజలు, చదువుకున్నవారు స్వాగతిస్తున్నారు. కానీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు స్వాగతించడం లేదు. కోడు గుడ్డుపై ఈకలు పీకిన చందంగా వ్యవహరిస్తున్నారు.
అమరావతిపై టీడీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా ధర్నాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని నిజమైన రైతులు గమనించాలి. అనంతపురం జిల్లా నుంచి లక్షలాది మంది రైతులు వలసలు పోతున్నారు. మీతో పాటు మమ్మల్ని కూడా అభివృద్ధి వైపు సాగనివ్వండి. సీఎం జగన్ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు. ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా.. 13 జిల్లాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు’అని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment