
సాక్షి, రాయచోటి : జన్మభూమి సభల్లో చంద్రబాబు ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడయాతో మాట్లాడుతూ శ్రమదానం, జన్మభూమి, ప్రజల వద్దకు పాలన ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ఆచరణ మాత్రం శూన్యం అంటూ విమర్శించారు. ప్రస్తుతం తెలుగుదేశం పాలన 'పైన పటారం.. లోన లొటారం' అన్న చందంగా తయారైందన్నారు.
గ్రామసభల్లో అధికారులు, నాయకులు ఉదయం నుంచి మద్యాహ్నం వరకూ ఏదో అది చేశాం,, ఇది చేశాం అని చెప్పుకోవడం తప్పితే ప్రజలకు చేసింది మాత్రం ఏమీలేదని విమర్శించారు. రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకులను కూడా గ్రామసభలో నలుగురికి ఇచ్చి ఫొటోలకు ఫోజులు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారంటూ దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతల నుంచే మైక్ లాక్కున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను ఎంతమాత్రం పట్టించుకుంటుందంటూ విమర్శించారు. గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలు ఎంత వరకూ పరిష్కరించారో అడుగుదామంటే గ్రామస్థలకు మైక్ కూడా ఇవ్వడం లేదని, ఎన్ని సార్లు అర్జీలు ఇస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
జగన్ వైపు యువత మొగ్గు : చంద్రబాబు చేస్తున్న మోసాలను రాష్ట్రంలో యువత ఎప్పటికప్పుడు గమనిస్తోందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి వైఎస్ జగన్ సరైన నాయకుడని యువత భావిస్తోందని, అందుకే జగన్ వైపు మొగ్గుతున్నారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటిలో నూతనంగా ఏర్పాటైన జగన్ యువసేన నాయకులతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సైనికుల్లా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.