సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రజలు దేవాలయంగా భావించే అసెంబ్లీని తెలుగుదేశం కార్యాలయంగా మార్చారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్షంపై బురద చల్లేందుకు నానాకష్టాలు పడుతున్నారని అన్నారు. హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ మొదటినుంచి ఒకటే మాట మీద ఉందని, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఊసరవెల్లి తరహాలో రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం, ఆపార్టీ నేతలు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, తిరగబడే పరిస్థితి వచ్చేసరికి హోదా కావాలంటున్నారని విమర్శించారు. హోదా విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన వైఖరితో ఉందని, ఎవరైతే హోదా ఇస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఓవైపు చంద్రబాబు బీజేపీతో అంటగాగుతూనే, మరోవైపు వైఎస్ఆర్‌సీపీ దగ్గరౌతోందని దుష్ఫ్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కేసుల భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు పక్కన పెడితే వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, పార్టీ నాయకులు ఆందోళనతలు, యువభేరీల ద్వారా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలుగుదేశం నేతలు అవిశ్వాసం పెట్టినా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ఇస్తుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు ఇలాగే డ్రామాలు ఆడారని, ఇప్పుడు మళ్లీ అవే డ్రామలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment